మీ గోళ్లు ఇలా మారితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..!
మనం వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు కళ్లు, నాలుక చూసి ఆరోగ్య పరిస్థితుల గురించి చెబుతుంటారు. అలాగే స్టెతస్కోప్ సాయంతో హార్ట్ రేటు చూస్తారు. నాడి వ్యవస్థను పరిశీలిస్తారు. ఇలా ఎలాంటి పరీక్షలు చేయకుండానే మన శరీరంలోకి కొన్ని భాగాలను చూసి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు వైద్యులు. అయితే గోళ్లలో కూడా ఆరోగ్యం దాగి ఉన్నట్లు మీకు తెలుసా..? అవును.. గోళ్ల రంగును బట్టి అనారోగ్యాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గోళ్లు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతాయి. ఇవి చేతులు, కాళ్లకు రక్షణ కల్పిస్తాయి. గోళ్ల ఆరోగ్యం మన శరీర ఆరోగ్యానికి సూచికగా చెప్తుంటారు నిపుణులు. గోళ్ల రంగు, ఆకారం, నిర్మాణంలో మార్పులు ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను తెలియజేస్తుందని వివరిస్తున్నారు.

గోళ్ల రంగు పూర్తిగా లేదా పాక్షికంగా తెల్లగా ఉంటే అది ఏదైనా గాయం, రక్తహీనత, పోషకాహార లోపం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక గోళ్లు చాలా వరకు తెల్లగా ఉండి అంచులు ముదురు రంగులో కన్పిస్తుంటే హెపటైటిస్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అలాగే గోళ్లు పసుపు రంగులో ఉంటే అది ఇన్ఫెక్షన్ గా భావించవచ్చని అంటున్నారు. చాలా అరుదుగా థైరాయిడ్, మధుమేహం, సొరియాసిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా గోళ్లు పసుపు రంగులోకి మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే గోళ్లలో కనిపించే మార్పులన్నీ శరీరంలోపల అనారోగ్యాలకు సూచనలు కావు. వేళ్లు, చేతులకు గాయాలైనా, ఇన్ఫెక్షన్లు సోకినా ఆ మార్పులు కన్పిస్తాయని చెబుతున్నారు. ఇక నెయిల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రొటీన్ లు, సిలికా, ఐరన్, జింక్ వంటి పోషకాలు అవసరం అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications