Eggs: ప్రొటీన్ల వెంటే పొంచిఉన్న ప్రమాదం.. వారికి కోడిగుడ్లు ప్రాణాంతకం కావచ్చు.. బీ అలర్ట్
Problems with Eggs: శరీరానికి అవసరమైన పూర్తిస్థాయి పోషకాలను అందించే ఆహారాలలో కోడి గుడ్లను ఒకటిగా చెబుతారు. అందుకే రోజుకో గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ కొన్ని సంస్థలు ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి. అయితే ఆరోగ్య రక్షణలో కీలకంగా వ్యవహరించే గుడ్డు, కొందరికి ప్రాణాంతకం కూడా అవుతుందని తెలుసా? అవును ఇది నిజమే.
కొందరు వ్యక్తుల్లో కోడి గుడ్లలోని ప్రోటీన్లకు శరీర రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి అలెర్జీకి గురి చేస్తుంది. ఈ పరిస్థితిని గుడ్ల అలెర్జీగా పిలుస్తారు. ఇలాంటి అలర్జీ కలిగిన వారు గుడ్లు తీసుకున్నప్పుడు చర్మంపై రాష్‌లు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనాఫైలాక్సిస్ కలిగించడం ద్వారా కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుంది కూడా.

దీనికి కారణం గుడ్ల ప్రోటీన్లను శరీరం పొరపాటున ప్రమాదకరంగా భావించి రసాయనాలు విడుదల చేస్తుంది. దీనివల్ల గుడ్లు తిన్న వెంటనే తేలికపాటి అసౌకర్యం నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యల వరకూ కొన్ని అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. సుమారు 2 శాతం పిల్లలకు ఈ అలెర్జీ ఉండగా, 70 శాతం మంది 16 ఏళ్ల వయసులో దాన్ని అధిగమిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుడ్ల అలెర్జీని నివారించడానికి గుడ్లతో పాటు అవి కలిసిన ఆహారపదార్థాలను దూరం పెట్టాల్సి ఉంటుంది. అయితే తేలికపాటి అలెర్జీకి యాంటీహిస్టమైన్ మందులు ఉపశమనం ఇస్తాయి. కానీ తీవ్రమైన రియాక్షన్‌లు ఉండే వ్యక్తులు వాటిని తినకుండా ఉండటమే మంచిది. ఇలాంటి వారు ఎగ్ ప్రోటీన్ కలిగిన ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్‌లను కూడా తీసుకోకూడదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే గుడ్లలోని పోషకాలను శరీరానికి అందించేందుకు ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications