వ్లాదిమిర్ పుతిన్ డైట్ సీక్రెట్స్- గుడ్లు తప్పనిసరి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోన్నారు. రెండు రోజుల పాటు ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మాజీ కేజీబీ ఏజెంట్ వయస్సు 73 సంవత్సరాలు. ఆయనను చూస్తే అంత వయస్సు ఉన్నట్టనిపించదు. ఇప్పటికీ దృఢంగా, చురుకుగా కనిపిస్తారు. ఈ వయస్సులో కూడా ఆయన ఆహారం, వ్యాయామం విషయంలో ఏమాత్రం రాజీ పడరు. దీనివల్ల ఆయన ఆహారపు అలవాట్లు, జీవనశైలి గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.
పుతిన్ రోజువారీ ఆహారం, ఆయన జీవనశైలి చాలా సీక్రెట్ గా ఉంచుతారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయిదేళ్ల కిందట వెలుగులోకి వచ్చింది. దీన్ని న్యూస్‌వీక్‌కు చెందిన బ్రిటిష్ జర్నలిస్ట్ బెన్ జుడా మూడు సంవత్సరాల పాటు వివిధ ఇంటర్వ్యూల్లో పరిశోధనలు చేసి సేకరించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని నవభారత్ టైమ్స్ తాజాగా ప్రచురించింది. దీనిద్వారా పుతిన్ అల్పాహారం, వ్యాయామ వివరాలు వెల్లడయ్యాయి.

బెన్ జుడా వివరాల ప్రకారం- పుతిన్ ఆలస్యంగా ఆల్పాహారాన్ని తీసుకుంటారు. రోజువారీ ఆహారంలో గుడ్లు తప్పనిసరి. అవి కోడిగుడ్లు కావు. కౌజు (Quail) పిట్ట గుడ్లు. వీటిని మార్కెట్ లో కొనరు. సొంతంగా పెంచిన కౌజు పిట్ట గుడ్లు. వీటితో పాటు బాతు గుడ్లను కూడా ఆహారంలో తీసుకుంటారు. విటమిన్ B12 కు అవి గొప్ప వనరు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
USDA నివేదిక ప్రకారం- కౌజు పిట్ట గుడ్లల్లో విటమిన్ B12 సహా అనేక పోషకాలను అధికంగా ఉంటాయి. ప్రోటీన్, విటమిన్ B 12, ఫోలేట్, కోలిన్, విటమిన్ A, ఐరన్, రిబోఫ్లేవిన్, ఫాస్ఫరస్, సెలీనియం వంటివి ఈ గుడ్లలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. హెల్త్‌లైన్ అందించిన సమాచారం ప్రకారం.. క్వాయిల్ గుడ్లు కణాల డ్యామేజ్, అలర్జీల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇవి తుమ్ములు, ఛాతీ పట్టేయడం, ముక్కు కారడం వంటి సమస్యలను నివారిస్తాయి.
దాదాపు 100 గ్రాముల కౌజు పిట్ట గుడ్లల్లో రోజువారీ అవసరమైన విటమిన్ B12 లో 66 శాతం ఉంటుంది. ఐరన్, ప్రొటీన్, రిబోఫ్లేవిన్‌లను కూడా అందిస్తాయి. పుతిన్ పచ్చి/ఉడకబెట్టిన క్వాయిల్ గుడ్లతో పాటు ఆమ్లెట్ లేదా వోట్స్ కూడా తింటారు. దీని తర్వాత పండ్ల రసం తీసుకుంటారు. చివరిగా కాఫీ తాగుతారు. మద్యానికి పూర్తిగా దూరం. పిస్తా ఐస్ క్రీం ఆయనకు ఇష్టమైన డెజర్ట్. విదేశీ పర్యటనలలో ఆయనకు పాల ఉత్పత్తులు ఇవ్వరు.
ఆయన దినచర్య తేనెతో కూడిన ట్వోరాగ్ (రష్యన్ కాటేజ్ చీజ్) తో మొదలవుతుంది. తాజా జ్యూస్, పచ్చి క్వాయిల్ గుడ్లు లేదా ఆమ్లెట్ తీసుకుంటారు. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో చేపలు తప్పనిసరి. స్మోక్డ్ వంటకాలను ఇష్టపడతారు. రెడ్ మీట్ కూడా ఆయన మెనూలో ఉంటుంది. టమాటో, దోసకాయ, ఇతర సాధారణ కూరగాయలతో కూడిన సాధారణ సలాడ్లను తీసుకుంటారు. హెవీ బేక్డ్ ఫుడ్స్, షుగర్ డెజర్ట్, ఛీజ్ తో చేసిన పేస్ట్రీలను ఇష్టపడరు.
పుతిన్ వ్యాయామానికి, దేహదారుఢ్యానికి సమాన ప్రాధాన్యత ఇస్తారు. అల్పాహారం తర్వాత పుతిన్ వ్యాయామం చేస్తారు. ఇందులో ఈత కొట్టడం, బరువులు ఎత్తడం వంటివి ఉంటాయి. ఆయన విందులకు హాజరైనప్పటికీ, ఆయన తినే ఆహారాన్ని సాధారణంగా ఆయన సొంత బృందం విడిగా తయారు చేస్తుంది. పుతిన్ రోజువారీ ఆహారం చాలా సాధారణంగా ఉంటుంది. రుచి కంటే ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు.
పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు, ఆయన ఆహార నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. హోటల్ లేదా ఆతిథ్య దేశ సిబ్బంది తయారు చేసిన భోజనాలను ఆయన అరుదుగా తీసుకుంటారు. ప్రత్యేక శిక్షణ పొందిన రష్యన్ చెఫ్‌లు, సహాయక సిబ్బంది ఆయనతో పాటు ఉంటారు. 'మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్'ను కూడా ఆయన వెంట తీసుకువెళ్తారని ప్రచారం ఉంది. భోజనాలను సురక్షిత ప్రదేశాలలో ఏర్పాటు చేసిన వంటగదిలలో తయారు చేస్తారు. దీనికోసం ప్రత్యక్షంగా తెచ్చిన లేదా ముందుగానే పూర్తిగా తనిఖీ చేసిన పదార్థాలను ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications