Liquid Gold: తల్లిపాలను గోల్డెన్ లిక్విడ్ అని ఎందుకంటారో తెలుసా? పిల్లలకు ఇవి చాలా కీలకం..
Colostrum Liquid Gold: చాలా మందికి తల్లిపాల విలువ తెలియదు. కొందరికి సాధారణంగా అవసరమైన స్థాయిలో ఇవి ఉత్పత్తి కాకపోవటంతో ఇబ్బంది పడుతుంటే మరికొందరు వీటి విలువ తెలియక పిల్లలకు డబ్బా పాలు అలవాటు చేస్తుంటారు. అయితే కొందరు తల్లులు మాత్రం తమ పిల్లలకు ఇవ్వగా అధికంగా ఉండే పాలను అవసరమైన పిల్లల వినియోగం కోసం డొనేట్ చేస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ప్రతి తల్లికి ఒక ప్రత్యేక అనుభవం. పుట్టిన తొలిరోజుల్లో శిశువు ఆరోగ్యం, ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషణకు ఇది చాలా ముఖ్యమైన ఆహారం. పైగా తల్లిపాలలో "లిక్విడ్ గోల్డ్" అని పిలువబడే కొలొస్ట్రమ్ ఉంటుంది. దీని ప్రయోజనాల గురించి ప్రతి తల్లి తప్పకుండా తెలుసుకోవటం చాలా అవసరం. ప్రసవం తర్వాత తల్లి పాలలో ఉండే కొలొస్ట్రమ్‍లో పోషకాలు, యాంటీబాడీలను ఉత్పత్తి చేసే తెల్ల రక్త కణాలు పుష్కలంగా ఉంటాయి. శిశువు రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో, పుట్టిన రోజుల వ్యవధిలో శిశుకుకు అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

కొలొస్ట్రమ్ శిశువు రోగనిరోధక శక్తికి చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. కొలస్ట్రమ్ యాంటీబాడీస్‌తో లోడ్ చేయబడినందున గొంతు, ఊపిరితిత్తులు, ప్రేగులలోని శ్లేష్మ పొరలను వ్యాధికారక కారకాల నుంచి రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పైగా హానికరమైన వైరస్, బ్యాక్టీరియాల పెరుగుదలను అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొలస్ట్రమ్ పేగులను ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడుతుంది. దృఢమైన జీర్ణవ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఈ అవరోధం చాలా ముఖ్యమైనదిగా వైద్యులు చెబుతున్నారు.
తల్లి పాలలో ఉండే కొలొస్ట్రమ్ నవజాత శిశువుకు సరైన పోషకాహారాన్ని అందిస్తుంది. ఇందులో శిశువు ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్ A, విటమిన్ E, విటమిన్ K, జింక్, సోడియం వంటి ఖనిజాలు అధిక స్థాయిలో ఉంటాయి. చిన్నపిల్లలో లో బ్లడ్ షుగర్ నివారించటంలోనూ కొలొస్ట్రమ్ కీలక పాత్ర పోషిస్తుంది. పైగా ఇందులోని కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని అందిస్తూ శిశువును చురుకుగా, అప్రమత్తంగా ఉండేలా చూస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే డాక్టర్లు నవజాత శిశువులకు తల్లిపాలు అందించాలని, అవి చాలా బలమైన, ఆరోగ్యవంతమైన ఆహారంగా చెబుతుంటారు.












Click it and Unblock the Notifications