మిథున రాశి, కర్కాటక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. డిసెంబరు నెలలో మిథున రాశి, కర్కాటక రాశి వారికి సమగ్ర జాతక ఫలం ఎలా ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశి వారికి డిసెంబరు నెల ప్రథమార్థంలో అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ, నెలాఖరుకు కేతువు, రాహువు సంచార మార్పుల వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పదో స్థానంలో శని సంచారం వల్ల పని ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసే గుణానికి అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో నిలకడ సాధిస్తారు. నెల ప్రారంభంలో రాబడి బాగానే ఉంటుంది. కానీ, డిసెంబరు మొదటి వారంలో రాహు-కేతువుల స్థాన చలనం వల్ల అనవసరమైన ఖర్చులు లేదా అకస్మాత్తుగా ధన వ్యయం పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తప్పనిసరి.

డిసెంబరు 5 తర్వాత కేతువు, శని ప్రభావాల వల్ల కుటుంబంలో చిన్నపాటి విభేదాలు లేదా మాటపట్టింపులు రావచ్చు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం, అనవసర చర్చలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. నిద్రలేమి, ఒత్తిడి వల్ల కొద్దిపాటి అలసట లేదా మానసిక ఆందోళన చెందే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి కేటాయించడం అవసరం. రాహు-కేతు ప్రభావం కొరకు శనివారాలు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం లేదా శివారాధన చేయడం శుభ ఫలితాలనిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ నెలలో గ్రహాల స్థితి వల్ల దైవానుగ్రహం, రక్షణ లభించి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే వృత్తి, ఉద్యోగాల్లో మంచి పురోగతి ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు లేదా ప్రాజెక్టులు పూర్తవుతాయి. తొమ్మిదో ఇంట శని అనుకూలత వల్ల నిరుద్యోగులకు లేదా ఉద్యోగ మార్పును కోరుకునే వారికి సానుకూల సమాచారం అందుతుంది. ఆర్థికంగా డిసెంబరు నెల స్థిరత్వాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు లేదా అనవసర ఖర్చుల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. రావాల్సిన పాత బకాయిలు కొద్దిగా చేతికి అందుతాయి.
2వ ఇంట్లో కేతువు సంచారం వల్ల మాట్లాడే విధానంలో కఠినత్వం రాకుండా చూసుకోవాలి. మాట తూలకుండా ప్రశాంతంగా ఉంటే కుటుంబంలో సంతోషం, సామరస్యం నెలకుంటాయి. రాహువు ప్రభావంతో వచ్చే చిన్నపాటి ఆరోగ్య రుగ్మతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. జీర్ణ సంబంధిత విషయాల్లో ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం లేదా దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.














Click it and Unblock the Notifications
