Karthika masam: కార్తీక మాసంలో తులసిని ఎందుకు పూజిస్తారు? తులసి పూజల విశిష్టత ఏంటి?
కార్తీకమాసంలో భక్తులు శివ క్షేత్రాలకు, వైష్ణవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కు, తులసి చెట్టు కూడా పూజలు నిర్వహిస్తారు. ఉసిరి చెట్టు విష్ణు స్వరూపంగా చెప్పుకున్నాం. ఇక కార్తీకమాసంలో తులసి చెట్టుకు పూజలు ఎందుకు చేస్తారు? తులసి చెట్టుకు పూజలు చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? వంటి అనేక విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే
కార్తీకమాసంలో మహా లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టును పూజిస్తారు. ఉసిరి చెట్టును నారాయణుడిగా, తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసం విష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం కావడంతో, ఈ మాసంలో విష్ణువును, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు నిర్వహిస్తారు. తులసి మొక్క మూలంలో సర్వ తీర్థాలు, మధ్యభాగంలో సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగంలో సర్వ వేదాలతో కొలువై ఉన్న లక్ష్మీదేవి ఉంటారు. అందుకే కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు.

లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే ఫలితమిదే
ముఖ్యంగా కార్తీకమాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారు అని, ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మన ప్రాచీన కాలం నుండి హిందువులు తులసి మొక్కలు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. రోజు తులసి మాతను పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసికి ఎంతో భక్తితో పూజలు చేస్తారని చెబుతారు. కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి స్నానమాచరించి భూమిపై లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు, కుంకుమలు కూడా పది కాలాల పాటు ఉంటాయని నమ్ముతారు.

తులసిపూజతో వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం
తులసిని సర్వరోగ నివారిణిగా, తులసి తీర్థాన్ని సర్వపాప హరిణి గా భావిస్తారు. కార్తీకమాసంలో తులసిని పూజించడం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుందని, వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం దొరుకుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని, తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు. తులసి మొక్క ఇంట్లో ఉన్నవారు అనారోగ్యాల బారిన నుండి రక్షించబడతారని పండితులు చెబుతున్నారు.

క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మకూ, తులసి మొక్కకు వివాహం శ్రేష్టం
కార్తీక మాసంలో తులసిని పూజించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మకూ, తులసి మొక్కకు వివాహం చేయడం, విష్ణువు కు లక్ష్మి కి చేసిన వివాహంగా పరిగణించడం ఎంతో కాలం నుంచి వస్తుంది. ఇలా ఈ మాసంలో విష్ణువుకు ఇష్టమైన తులసిని పూజించటం వల్ల విష్ణువు యొక్క కరుణ కటాక్షం భక్తులపై ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే కార్తీక మాసంలో విశేషంగా తులసి పూజను చేస్తారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
Karthika masam: కార్తీకమాసంలో ఉసిరిచెట్టుకు పూజలు.. ఉసిరి దీపాలు: అసలు ఎందుకు?












Click it and Unblock the Notifications