వరంగల్: పోలీసులు వెంటాడుతుండడంతో వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ ఒక టీవీ చానెల్ కార్యాలయంలో తలదాచుకున్నారు. పోలీసులు తీరుపై ఆయన తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. తమ నేత కె.చంద్రశేఖరరావు పరిస్థితిపై ఖమ్మంలో తాను మాట్లాడిన తర్వాత పోలీసులు తన వెంట పడ్డారని ఆయన టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. తాను ఖమ్మం నుంచి వరంగల్ కు బయలుదేరిన వెంటనే తనను ఖమ్మం పోలీసులు వెంబడించారని ఆయన చెప్పారు. తనను ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
కెసిఆర్ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని వినయ్ భాస్కర్ చెప్పారు. పోలీసుల తీరుపై ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో పోలీసులు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. దాదాపు మూడు గంటల పాటు టీవీ చానెల్ కార్యాలయంలో తల దాచుకున్న వినయ్ భాస్కర్ తన పరిస్థితిపై వివరించారు.