ముంబై: షేర్ మార్కెట్ లో సెంటిమెంట్ బలపడింది. స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభాలతో ముగిసింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలతో మదుపుదారులు కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. మనదేశ ఎగుమతుల్లో వృద్ధి నమోదయిందన్న వార్త మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో మార్కెట్‌లో భారీ ర్యాలీ కొనసాగింది.
బీఎస్‌ఈ సూచి సెన్సెక్స్ ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ 343 పాయింట్లు ఎగసి 16,772 వద్ద స్థిరపడింది. ఎన్ ఎస్ ఈ సూచి నిఫ్టీ కీలక 5 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 5,017 వద్ద కుదురుకుంది. అన్ని ప్రధాన వాటాలు లాభాలను ఆర్జించాయి.