కర్నూలు: తెలుగుదేశం పార్టీ కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య బహిష్కరణకు గురయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర నాయకత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన కార్యకలాపాలు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు చెప్పారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తనపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు కొంత మంది జిల్లా నాయకులు చాడీలు చెప్పారని ఆయన అన్నారు.
చంద్రబాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేపు తాను పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తానని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు కెఇ కృష్ణ మూర్తి తదితరులపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వినూత్న ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా, విచిత్ర వేషధారణలు ధరించి ప్రదర్శనలు చేయడం ద్వారా ఆయన రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వచ్చారు.