విశాఖపట్నం: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా రూపొందడానికి విశాఖ అనుకూలమైనదని కలెక్టర్ జె.శ్యామలరావు చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐబీఎం, ఎస్ టీపీఐ, ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంగళవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరమయిన, అందమైన నగరం విశాఖని అభివర్ణించారు. విశాఖ ప్రజలు స్నేహశీలురని, ప్రశాంతమైన, శాంతియుత నగరమని కితాబిచ్చారు. విశాఖ నగరానికి విమాన, రైలు, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో దుబాయ్, సింగపూర్, కొలంబో నగరాలకు విమాన సౌకర్యం కల్పించడానికి పలు విమానాయాన సంస్థలు ముందుకువస్తున్నట్టు తెలిపారు. రాత్రివేళల్లో మరిన్ని గంటలు విమానాల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. పర్యాటక, ఐటీ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఐబీఎం కూడా తోడైతే ఈ ప్రాంతంలోని మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశా రు. ముంబయి, పూనే, బెంగళూరు, చెన్నై నగరాలకు ఐటీ నిపుణులు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ సంస్థలను ఇక్కడ ఏ ర్పాటు చేస్తే వలసలను అరికట్టే వీలుంటుందని చెప్పారు. రవాణా, విద్యుత్, మంచినీరు పుష్కలంగా ఉన్నాయన్నారు. సమావేశంలో ఐబీఎం ప్రతినిధులు అమంద, అనూజ్, సుజిత్, సీతారాం పాల్గొన్నారు.