హైదరాబాద్: ప్రారంభమైన కొద్దిసేపటికే గురువారం శాసనసభ వాయిదా పడింది. చేనేత కార్మికుల సమస్యలపై తక్షణ చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా నచ్చజెప్పినా వారు వినలేదు. దాంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. చేనేత కార్మికుల సమస్యలపై, ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దాన్ని స్పీకర్ తోసిపుచ్చారు.
ప్రతిపక్షాలు వినకుండా చేనేత కార్మికుల సమస్యలపై చర్చ జరగాల్సిందేనని పట్టు బట్టాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని కోల్పోవద్దని, విలువైన సభా సమయాన్ని వృధా చేయవద్దని స్పీకర్ సూచించారు. డిమాండ్లపై చర్చ సందర్భంగా ఆ విషయంపై మాట్లాడవచ్చునని ఆయన సూచించారు. అయినా ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.