భాను కిరణ్ కోసం పోలీసుల విస్తృత వేట, అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి విచారణ

సీసీఎస్ అధికారులు భానుకిరణ్ తల్లి, సోదరి, బావలను మంగళవారం పిలిపించారు. వారిని మూడు గంటలసేపు విచారించారు. కొన్ని అంతర్గత విషయాలను వాకబు చేసినట్టు తెలిసింది. బయటకు వచ్చిన అనంతరం భానుకిరణ్ బావ బ్రహ్మానందం మాట్లాడారు. పోలీస్ అధికారులు అడిగిన వివరాలను చెప్పామని, మరోమారు పిలిచినా వస్తామని అన్నారు. తమకూ, భానుకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, తమకు ఎలాంటి ఆస్తులు, నగదు ఇవ్వలేదని అతడి తల్లి స్పష్టం చేసినట్టు తెలిసింది. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు అవసరమైనంత వ్యవధి ఇవ్వాలని కోరారు. భానును పోలీసులు ఏం చేసినా తమకు అభ్యంతరం లేదంటూ ఒకదశలో వ్యాఖ్యానించినట్టు సమాచారం.
భానుకిరణ్‌తో కలిసి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు మంచిరేవులలో భూమి కొనుగోలులో భాగస్వామిగా ఉన్న అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డిని సీసీఎస్ పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. భూమి కొనుగోలు, భానుతో ఏ మేరకు పరిచయం, సూరితో సంబంధాలున్నాయా వంటి అంశాలపై సుమారు నాలుగు గంటలపాటు ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణలో భాగంగా భానుతో సంబంధం ఉన్నవారినందరినీ ప్రశ్నిస్తున్నామని, ఇందులో భాగంగానే అతడి కుటుంబ సభ్యులను, అబ్బిరెడ్డిని పిలిపించామని సీసీఎస్ డీసీపీ సత్యనారాయణ వివరించారు












Click it and Unblock the Notifications