చంద్రబాబు వర్గానికి తెలంగాణ సెగ: మెరుపుదాడులు చేస్తామన్న ఓయు జెఏసి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అనుకూల తెలంగాణ ప్రాంత నేతలకు తెలంగాణ సెగ తగులుతోంది. మహబూబ్ నగర్ జిల్లా టిడిపి సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి వ్యవహారంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరంపై, పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరానికి హెచ్చరికలు జారీ చేసింది. నాగం జనార్దన్ రెడ్డికి మద్దతుగా నిలిచింది.
నాగం ఒంటరి వాడు కాదని ఆయనకు తెలంగాణ ప్రజల మద్దతు ఉందని ఓయు జెఏసి టిడిపిని హెచ్చరించింది. నాగం జై తెలంగాణ అన్నందుకే పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించింది. తెలంగాణకు వ్యతిరేకంగా టిడిపి ఫోరం తీరు ఉందని వారు ఆక్షేపించారు. టిడిపి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించే తెలంగాణ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే మెరుపు దాడులు తప్పవని హెచ్చరించారు.