"డిప్యూటీ సీఎం అయితే ఓకే.. కానీ వన్ కండీషన్..!!"
ఎన్నికల సంఘం మార్చి 15న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందో లేదో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయం ఇప్పుడంతా స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాగైనా విజయ్ ను ఎన్డీయే కూటమిలోకి లాగాలని బీజేపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలని భావిస్తోంది. అయితే విజయ్ అందుకు సుముఖంగా లేనప్పటికీ తెర వెనుక మాత్రం ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది.
డిప్యూటీ సీఎం పదవి, 80 పైగా అసెంబ్లీ స్థానాలను తమ పార్టీకి కేటాయిస్తే ఎన్డీయే కూటమిలో చేరేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం డిప్యూటీ సీఎం పదవితో పాటుగా 55 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. అధికార డీఎంకే- కాంగ్రెస్ ను ఓడించాలంటే విజయ్ తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని బీజేపీ భావిస్తోంది.
అయితే టీవీకే పార్టీని ఎన్డీయే కూటమిలోకి లాగడాన్ని AIADMK పార్టీ తప్పుబడుతోంది. ఈ పొత్తుపై ఈ మేరకు ఎడప్పాడి పళనిస్వామి (EPS) నేతృత్వంలోని AIADMK అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పొత్తులో భాగంగా విజయ్ కు ఎక్కువ సీట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీకి కేవలం 100 నుంచి 110 సీట్లు మాత్రమే మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు విజయ్ ను ఎన్డీయే కూటమిలోకి రానివ్వకుండా ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. టీవీకే ప్రభావం పెరిగి తమ పార్టీ కార్యకర్తల అస్తిత్వానికే దెబ్బ పడుతుందని పళనిస్వామి భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
మరోవైపు బీజేపీని విజయ్.. సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా ప్రకటిస్తూ వస్తున్నారు. అలాగే AIADMK తోనూ తమకు సంబంధం లేదని చెబుతున్నారు. మరి ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇప్పటికే విజయ్.. సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. దాంతో విజయ్.. ఎన్డీయే కూటమిలో చేరతారని అందరూ భావిస్తున్నారు. అటు విజయ్ కుటుంబ వ్యవహారాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటన్నింటి మధ్య విజయ్ టీవీకే పార్టీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను రాబడుతుందో వేచి చూడాలి.

ఇక తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23 న ఓటింగ్ జరగనుంది. మే 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications