ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడికి ప్రియురాలు చెప్పుదెబ్బలు
Districts
oi-Srinivas G
By Srinivas
|
ఒంగోలు: తనను ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువకుడికి నడిరోడ్డుపైనే చెప్పుదెబ్బలతో దేహశుద్ది చేసి బుద్ధి చెప్పిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన శివప్రసాద్ అనే యువకుడు సీమ అనే యువతిని కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. శివప్రసాద్ మైసూలు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం శివప్రసాదుకు చెన్నై బదిలీ కావడంతో అక్కడకు వెళ్లాడు. అయితే ఆరు నెలలు ఆయన ఆచూకి తెలియలేదు. దీంతో ప్రేమికురాలు సీమ చీరాలలోని శివప్రసాద్ ఇంటికి వెళ్లి గత మూడు నెలలుగా మౌన దీక్ష చేపట్టింది. ఈ విషయం తెలిసిన శివప్రసాద్ అటువైపు రాలేదు.
పోలీసులు కూడా సీమ దీక్షపై నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. మీడియా కథనాలు తదితర కారణాల వల్ల ఎట్టకేలకు స్పందించిన పోలీసులు శివప్రసాదును అదుపులోకి తీసుకున్నారు. అయితే శివప్రసాద్ ఆ తర్వాత కూడా సీమను బెదిరించాడని తెలిస్తోంది. ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడిన శివప్రసాదుపై ఆగ్రహం వ్యక్తం చేసి సీమ నడిరోడ్డుపైనే ప్రియుడికి చెప్పుదెబ్బలతో బుద్ది చెప్పింది. ప్రియుడిని కొట్టుకుంటూ పోలీసు స్టేషనుకు తీసుకు వెళ్లింది.