నెల్లూరు: సిబిఐ అరెస్టుకు భయపడి ఇంట్లో దాక్కున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవూరులో గొప్పలు చెప్పుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఆయన గురువారం తమ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహించారు. కోవూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దొంగ అయితే, వైయస్ జగన్ గజదొంగ అని ఆయన అన్నారు. నాయకత్వ లోపంతో, అవినీతితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెసు ఐదు రాష్ట్రాల్లో దెబ్బ తిన్నదని, కోవూరులో ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటేయాలని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో సైకిల్ దెబ్బకు హస్తం, ఏనుగు పటాపంచలయ్యాయని, రాష్ట్రంలో కూడా సైకిల్ దెబ్బకు హస్తం, ఫ్యాన్ తుక్కుతుక్కు అవుతాయని ఆయన అన్నారు. తృతీయ కూటమి ఏర్పాటు ద్వారా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందని ఆయన అన్నారు. సిగ్గులేని ప్రభుత్వం కరెంట్ లేక మంచినీళ్లు ఇవ్వడం లేదని, బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం ఇస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని సిగ్గులేని నాయకత్వం నడుపుతోందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు.