గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంపై గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సోమవారం స్పందించారు. మంత్రులకు సుప్రీం నోటీసులు ఇవ్వడం కాంగ్రెసు పార్టీకి దెబ్బే అని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిగి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని ఆయన అన్నారు. మంత్రులపై విచారణ జరిగి న్యాయం బయటపడక పోవచ్చునని అన్నారు. ఈ కేసులో సుప్రీం కోర్టే సిబిఐ చేత విచారణ చేయిస్తే బాగుంటుందని అన్నారు. ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేసినంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. రాయపాటి మంత్రుల నోటీసులపై తీవ్రంగా స్పందించడం గమనార్హం.
అంతకుముందు మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టు నోటీసులను మంత్రులు స్వాగతించాలనే ఉద్దేశ్యంతో మాట్లాడటం గమనార్హం. తప్పు చేయలేదని సీతకు, రాముడికి తెలుసునని, అయినప్పటికీ సీత అగ్ని ప్రవేశం చేయక తప్పలేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంత్రులు కూడా ఈ కేసులో తాము పునీతులమని నిరూపించుకోవాలని సూచించారు. మంత్రులకు సుప్రీం నోటీసులపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. మంత్రివర్గం బాధ్యత వహించాలన్నారు. అవినీతిపై అన్ని పార్టీలు పోరాడాలన్నారు.