ముఖ్యమంత్రిగా శెట్టార్ ప్రమాణం: డిప్యూటీలుగా ఇద్దరు

Posted By:
Subscribe to Oneindia Telugu
Jagadish Shettar swears-in as CM
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జగదీష్ శెట్టార్ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ భరద్వాజ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. కర్నాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప, మరో సీనియర్ నేత అశోక్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జగదీష్ శెట్టార్ కర్నాటకకు 27వ ముఖ్యమంత్రి. గత సాధారణ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఆ పార్టీకి చెందిన మూడో ముఖ్యమంత్రి శెట్టార్. శెట్టార్ మంత్రివర్గంలో 32 మందికి చోటు దక్కింది.

కాగా శెట్టార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప వర్గం, సదానంద గౌడ వర్గాలకు చెందిన వారు తమకు అంటే తమకు ఎక్కువ ఎక్కువ పోర్టు పోలియోలు కావాలని పట్టుబట్టారు. కర్నాటకలో లింగాయతులు ఎక్కువ. మఠాధిపతులుగా, గురువులుగా ఆ వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో లింగాయతులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు.

బిజెపికి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తలనొప్పి పోయి రాజీనామాకు సై అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి సదానంద గౌడ సమస్య ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామాకు సిద్ధమన్న సదానంద గౌడ తాను రాజీనామా చేయాలంటే... అని పార్టీ ముందు కొన్ని షరతులు పెట్టారు. తన షరతులకు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని లేదంటే ససేమీరా అన్నారు.

తన షరతులకు అంగీకరించకుంటే బిజెపిఎల్పీ సమావేశాలకు కూడా రానని తెగేసి చెప్పారు కూడా. జగదీష్ శెట్టార్ కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే లోగా తన డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఆయన అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టారు. శెట్టార్ కెబినెట్లోని 32 మంత్రుల పేర్ల వివరాలను తనకు ముందే ఇవ్వాలని, మంత్రివర్గంలో తన వర్గానికి చెందిన వారిని 15 మందిని తీసుకోవాలని, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా తమకే ఇవ్వాలని షరతులు పెట్టారు.

తనకు రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవిని అప్పగించాలని కూడా ఆయన ఖరాఖండిగా చెప్పారు. పార్టీ అధిష్టానం గౌడకే పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే కేబినెట్లోకి 15 మంది మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవి అంశాలపై అధిష్టానం తర్జన భర్జన పడుతోందని సమాచారం. అయితే చివరకు సదానంద గౌడను ఒప్పించి, మెప్పించి ఈశ్వరప్పచే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించడంలో అధిష్టానం సఫలమైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jagadish Shettar sworn-in as Chief Minister of Karnataka by Governor Bhardwaj a short while ago (July 12) in Bangalore.
Please Wait while comments are loading...