TTD: 15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు.. డిప్యూటీ ఈవో గుట్టురట్టు.
తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో ఉదయాన్నే ఒక వార్త పిడుగులా పడింది. టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఒకేసారి పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది.
ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ దాడులను అత్యంత రహస్యంగా నిర్వహించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న ఆయన లాకర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆయన ఇల్లే కాకుండా.. తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో ఆఫీస్, వసతిగృహంతో పాటు బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదల్లేదు.

బంధువుల ఇళ్లపైనా విరుచుకుపడ్డ బృందాలు
లోకనాథంకు చెందిన బినామీ ఆస్తులు, కీలక పత్రాల అన్వేషణలో భాగంగా ఆయన నెట్‌వర్క్‌పై ఏసీబీ నిఘా పెట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక ఆధారాలు, నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు!
తిరుమల శ్రీవారి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక ఉన్నతాధికారిపై ఏసీబీ ఈ స్థాయిలో దాడి చేయడం గమనార్హం. గతంలో 2011లో అప్పటి టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు జరిగాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఒక డిప్యూటీ ఈవో స్థాయి అధికారి నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో తిరుపతి, తిరుమల ప్రాంతాల్లోని ప్రభుత్వ, టీటీడీ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ సోదాల్లో ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయోనన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
