అమిత్ షా తేల్చేసారు - సమస్యల పరిష్కరం పై : కీలక భేటీకి ఆదేశం..!!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ విధానం తేల్చి చెప్పారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ విభజన అంశాలే కీలకంగా చర్చకు వచ్చాయి. ఏపీ నుంచి మంత్రులు బుగ్గన..పెద్దిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. సదరన్ జోనల్ కౌన్సిల్ అజెండాలో భాగంగా 26 అంశాలను ప్రతిపాదిస్తే అందులో 9 ఏపీ పునర్విభజన అంశాలే ఉన్నాయి.

పరస్పరం పరిష్కరించుకోవాలి
రెండు తెలుగు రాష్ట్రాలూ పరస్పరం పరిష్కరించుకోవాల్సిన అంశాలను త్వరగా తేల్చుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. చర్చల ద్వారా పరస్పరం ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని నిర్దేశించారు. ఏపీ, తెలంగాణాకు చెందిన వివిధ అంశాలపై చర్చించారు.
వ్యూహాత్మకంగా, వాణిజ్య పరంగా తీరప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రాలు భారత్ కు ఎంతో ముఖ్యమని వీటిని కలుపుతూ ప్రత్యేక రవాణామార్గాలను కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్‌షా ప్రకటించారు. తీరప్రాంత రాష్ట్రాల వద్ద నార్కోటిక్స్ స్మగ్లింగ్ లాంటి అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై కేంద్ర రాష్ట్రాలు ఉమ్మడిగా నిఘా వేయాల్సిన అవసరముందని అమిత్ షా సూచించారు.

ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు
ఇప్పటికే 12 లక్షల మంది మత్స్యకారులకు క్యూఆర్ కోడ్ తో కూడిన ఆధార్ గుర్తింపు కార్డులు జారీ చేశామని చెప్పుకొచ్చారు. సాగర తీరప్రాంత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 7,737 కోట్లను వ్యయం చేస్తున్నట్టు లెక్కలు చెప్పారు. మొత్తం 108 ప్రాజెక్టులకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.76 వేల కోట్లను వ్యయం చేసిందని అమిత్ షా వివరించారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం చేయూత ఇవ్వాలని కోరారు. పెండింగ్ అంశాల పర్యవేక్షణకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సమావేశం
రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీగా రూ.25,000 కోట్లు ఇవ్వాని కోరారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వండని అమిత్ షా ను కోరారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని మరోసారి ప్రభుత్వం నుంచి వాదన వినిపించారు. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఇన్‌స్టిట్యూషన్ల ఆస్తుల పంపిణీ కోసం ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశించారు.












Click it and Unblock the Notifications