ఏపీ సర్కారు కీలక ఉత్తర్వులు: డ్రాయింగ్ ఆఫీసర్ల వ్యవస్థలో మార్పులు
అమరావతి: రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు, పంచాయతీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. సచివాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు ఆదేశాలిచ్చింది.
పంచాయతీ ఉద్యోగులకు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి.. డీడీఓగా వ్యవహరించనున్నారు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులందరికీ డీడీఓగా వీార్వోకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకూ మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్బర్స్ మెంట్ అధికారి బాధ్యతల్ని కూడా
పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులే నిర్వర్తించారు. ఇకపై పంచాయతీలకు, సచివాలయాలకు వేర్వేరుగా డీడీఓలు నియమించింది. పంచాయతీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇది ఇలావుంటే, విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆదేశించారు. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు.
సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జేఎన్టీయూ తయారు చేసిన ప్రశ్నాపత్రాలు ఆయా కాలేజీల్లో వినియోగించాలని సూచించారు. నాన్ అటానమస్ కాలేజీలకూ ఇవే ప్రశ్నాపత్రాలు ఉంటాయని స్పష్టం చేశారు. పేపర్ వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. పరీక్షల్లో అక్రమాల నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు.