రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు: కర్ణాటకలో బీజేపీ వైఖరి నిరసనగా!
బెంగళూరు: మెజారిటీ లేని బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ మేరకు కర్ణాటక పరిణామాలను నిరసిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పేర్కొంటూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు జిల్లాల ప్రధాన కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టాలని అన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ స్థాయిలో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications