హోంమంత్రి రాజీనామా చేయాలి - తల్లులమీద మాట్లాడితే తాటతీస్తాం : అనిత..!!
హోం మంత్రి తానేటి వనిత పైన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విజయవాడ - రేపల్లెలో జరిగిన ఘటనలకు ఏ తల్లి తప్పు ఉందో చెప్పాలని డిమాండ్ చేసారు.విశాఖలో హోం శాఖ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆడవాళ్లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు వంటివి జరగకుండా తల్లులే జాగ్రత్త తీసుకోవాలన్నారు.
తల్లి పాత్ర సక్రమంగా పోషించకుండా పోలీసుల మీద, ప్రభుత్వం మీద వేయడం సరైన పద్ధతి కాదన్నారు. మొదట బిడ్డల బాధ్యత తల్లులు దే, తరువాతే పోలీస్ లది అంటూ వ్యాఖ్యలు చేశారు. తల్లి పిల్లలు పెరిగే వాతావరణం కూడా చూసుకోవాలన్నారు. ఆడ బిడ్డల సంరక్షణ తండ్రి మీద కంటే తల్లి మీదే ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు అనిత సైతం.. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తున్నారంటూ మండి పడ్డారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా తానేటి వనిత రాజీనామా చేయాలన్నారు.

చేతగానిపాలన అసమర్ధ పాలన వల్ల జరుగుతున్న ఘటనలు కూడా తల్లుల పెంపకం పైకి నెట్టే స్దాయికి దిగజారారని ధ్వజమెత్తారు. తొమ్మిది నెలల పిల్లలు, మూడేళ్ళ పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరుగుతుంటే అది కూడా తల్లులు తప్పేనా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీసారు. సీఎం ఇంటికి కూత వేటు దూరంగా జరిగిన ఘటనల పైనా స్పందించారా అంటూ దుయ్యబట్టారు. మహిళలపై వరుసగా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా జగన్ మూగ సీఎంలా మారారంటూ వ్యాఖ్యానించారు.
ఇష్టానుసారంగా తల్లుల పెంపకం మీద తల్లులమీద మాట్లాడితే తాటతీస్తామంటూ హెచ్చరించారు. ఈ హోం మంత్రి కన్నా గతంలో పనిచేసిన హోంమంత్రి బెటర్ అనిపిస్తుందని.. కనీసం రాసిచ్చిన స్క్రిప్ట్ అయినా చదివే వారన్నారని ఎద్దేవా చేసారు.












Click it and Unblock the Notifications