ఏపీ మంత్రివర్గ భేటీ - పథకాల అమలు, వాలంటీర్ల పై కీలక నిర్ణయం..!!
ఏపీ మంత్రివర్గ కీలక భేటీ ఈ రోజు (గురువారం) జరగనుంది. పలు ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు పూర్తవుతున్న వేళ హామీల అమలు దిశగా నిర్ణయాలు ఉండనున్నాయి. సూపర్ సిక్స్ పథకాల పైన చర్చించనున్నారు. అదే విధంగా వాలంటీర్ల వివాదానికి ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఈ భేటీ లో కీలక నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ పొడిగింపు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
హామీల అమలుపై
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ది దారులు..పథకానికి అర్హుల ఎంపిక..ఆర్దిక భారం వంటి అంశాల పైన చర్చించి అర్హుల ఎంపిక పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు పైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసారు. ఈ నిర్ణయం అమలుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.

ప్రతీ ఇంటికి కుళాయి
రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు..కేంద్రం ఈ పథకం కోసం ఇచ్చే నిధుల సద్వినియోగం పైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం తాజాగా రూ 2,800 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు పనుల గురించి ఈ భేటీలో అధికారులు వివరించనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం..తదుపరి అడుగుల గురించి చర్చించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వాలంటీర్లను ఏం చేద్దాం
13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా..రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చిస్తారని సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాల పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వీటితో పాటుగా వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు..వేతనాల చెల్లింపు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకం పైన నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications