ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్యేల షాక్! ఎమ్మెల్యేలకు జగన్ బంపర్ ఆఫర్!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజలవద్దకు చేరిన తర్వాత వారి నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటోంది? వారి అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వం తరఫున చేయాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? వారిలో అసంతృప్తి ఉంటే ఎలా నివారించాలి? తదితర విషయాలన్నింటిపై అవగాహన కోసం ''గడప గడపకు మన ప్రభుత్వం'' పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఆ పార్టీకి ఎంతో మేలు జరిగిందనేది రాజకీయ విశ్లేషకుల భావన.

ఎమ్మెల్యేలను నిలదీస్తున్న ప్రజలు
''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమంలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు స్థానిక ఎమ్మెల్యేలను నిలదీయం ప్రారంభించారు. నిధుల కొరతతో ఇంతవరకు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేని ఎమ్మెల్యేలకు ప్రజలను ఎలా సముదాయించాలో అర్థం కాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే ఎదురు మాట్లాడినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరిపై కేసులు నమోదు చేయించారు. ఈ చర్యలు ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని చూపించాయి.

జగన్‌ను ఆలోచనలో పడేసిన ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
ఇంటిలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాలపై సీరియస్‌గా దృష్టిసారించారు. అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం సంచలనం కలిగించింది. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అయితే ముఖ్యమంత్రి జగన్ మీట నొక్కడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్నారని, తాము మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు లేక చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామంటూ వ్యాఖ్యానించారు. ఈ తరహా వ్యాఖ్యలు కూడా ప్రభాత్వాధినేతను ఆలోచనలో పడేశాయి.

ఈనెల 6వ తేదీ నుంచి ఎమ్మెల్యేలతో సమావేశాలు
ఈనెల ఆరోతేదీ నుంచి ప్రతి నియోజకవర్గానికి రూ.12 కోట్ల చొప్పున విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు అందజేస్తారు. అది వారి విచక్షణ మేరకు ఉపయోగించుకోవచ్చు. తర్వాత రూ.10 కోట్లను రెండు విడతలుగా అందజేయనున్నారు. అవసరం అనుకున్న నియోజకవర్గాలకు మరికొంత సైతం అందజేయనున్నట్లు సమాచారం. ఈనెల 6వ తేదీ నుంచి జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో జగన్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాల్లోకానీ, సమావేశాల అనంతరం కానీ ఎమ్మెల్యేలకు నిధులు విడుదల కాబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications