టీడీపీకి బుగ్గన స్ట్రాంగ్ కౌంటర్-మీ అప్పులు, కరోనాతోనే కష్టాలు-అవాస్తవాలతో విష ప్రచారం
ఏపీలో రాష్ట ప్రభుత్వ అప్పులపై టీడీపీ వర్సెస్ వైసీపీ ప్రభుత్వంగా సాగిపోతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. వైసీపీ సర్కార్ ను టార్గెట్ గా చేసుకుని నిత్యం టీడీపీ చేస్తున్న అప్పుల ఆరోపణలపై ఇవాళ మరోసారి ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ ఆరోపణల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
అప్పులపై ప్రతిపక్ష నేతల ఆరోపణలు హేయమని ఆర్ధికమంత్రి బుగ్గన అన్నారు. కరోనాతో ప్రభుత్వ రాబడులు తగ్గాయని,
కరోనా కట్టడికి రూ.7190 కోట్లు ఖర్చుపెట్టామని ఆయన గుర్తుచేశారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా చేసిన అప్పుల మోరాన్ని ఇప్పటికీ తాము మోస్తున్నామని బుగ్గన తెలిపారు. కరోనాతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలైందని, అన్ని రాష్ట్రాలు, దేశాలూ అప్పులు చేస్తున్నాయని బుగ్గన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పరిమితికి లోబడే అప్పులు చేస్తోందని, పరిధి దాటడం లేదని ఆయన వెల్లడించారు.

కరోనాలో విచక్షణతో అప్పులు చేసి ప్రజల్ని ఆదుకున్నామని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. చదువే పిల్లలకిచ్చే ఆస్తి అంటూ 25 వేల కోట్లు ఖర్చు పెట్టామని, కరోనా కాలంలో అవ్వా తాతలకు 37 వేల కోట్ల పించన్లు ఇచ్చామని బుగ్గన పేర్కొన్నారు. అలాగే అక్కాచెల్లెళ్లకు చేయూత, ఆసరా, సున్నావడ్డీలతో 17 వేల కోట్లు ఇచ్చామన్నారు. నేరుగా ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడం ద్వారా వస్తువులు, సేవల డిమాండ్ దెబ్బతినకుండా కాపాడగలిగినట్లు ఆయన వివరించారు.
ప్రజల్నే కాదు ఆర్ధిక వలయంలో ఉన్న కంపెనీలు, వాటి ఆధారంగా లక్షలాది ఉపాధి మార్గాల్ని నిలబెట్టామని బుగ్గన తెలిపారు. ఓ పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని బుగ్గన ఆరోపించారు.
అవాస్తవాలు, అసంబంద్ధ ప్రచారాలతో ఓ వ్యూహం ప్రకారం టీడీపీ విష ప్రచారం చేస్తోందన్నారు.
Recommended Video
ఇప్పటికే టీడీపీ అప్పులపై చేస్తున్న ఆరోపణలపై పలుమార్లు స్పందించిన ఆర్ధికమంత్రి బుగ్గన.. టీడీపీ హయాంలో చేసిన అప్పుల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్ధితి దాపురించిందని పదే పదే చెప్తున్నారు. ఇవాళ కూడా అదే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే కరోనా కారణంగా రాబడులు తగ్గినా అప్పులు చేసి మరీ సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తద్వాా విపక్షాలవి కేవలం రాజకీయ విమర్శలే అని బుగ్గన చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications