సచివాలయాల ఉద్యోగులకు వేర్వేరు పే స్కేల్స్ ఎందుకంటే ? సర్కార్ క్లారిటీ..!
ఏపీలో సచివాలయాల (స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం) ఉద్యోగులకు తాజాగా ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం (AP Govt).. పే స్కేల్స్ విషయంలో మాత్రం తేడాలు చూపిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత పే స్కేల్స్ అందరికీ ఒకేలా కాకుండా వేర్వేరుగా ఉండటంతో కొందరు ఉద్యోగులు నష్టపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల శాఖ ముఖ్య కార్యదర్శి కాటంనేని భాస్కర్ తాజాగా వివరణ ఇచ్చారు. ప్రమోషన్ల తర్వాత అందరికీ ఒకే పే స్కేల్ ఇవ్వాలన్న ఉద్యోగుల డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయాల ఉద్యోగుల్ని వివిధ శాఖలకు పంపారు. డిప్యుటేషన్ తో పాటు శాశ్వతంగా వేల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇలా ఇతర శాఖలకు తరలించారు. హేతుబద్దీకరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రమోషన్ల తర్వాత పేస్కేల్ వర్తింపు విషయంలో వారికి శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ కాటంనేని భాస్కర్ దీనిపై స్పందించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న పోస్టుల్లోకి సచివాలయ ఉద్యోగులను ప్రమోషన్ పై తీసుకెళ్లి విధుల్లో చేర్చేటప్పుడు, ఆయా శాఖలో ఇప్పటికే అమల్లో ఉన్న పే స్కేల్‌ను మాత్రమే వర్తింపజేయడం సాధ్యమవుతుందని ఆయన తేల్చిచెప్పేశారు.

సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొత్త పే స్కేల్‌ను సృష్టించడం సాధ్యం కాదని కాటంనేని భాస్కర్ వెల్లడించారు. ఉద్యోగులు కోరుతున్న విధంగా కొత్త పే స్కేల్‌ను సృష్టిస్తే.. అదే పోస్టుల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల పే స్కేల్‌ను కూడా మార్చాల్సి వస్తుందని, కాబట్టి ఇది సాంకేతికంగా సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే, ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఏదైనా శాఖలో అమల్లో ఉన్న పే స్కేల్ తక్కువగా ఉందని ఉద్యోగులు భావిస్తే, తమ మాతృ శాఖ పెద్దలతో మాట్లాడి తమ అర్హతలకు తగిన పే స్కేల్ కు ప్రమోషన్ ఛానల్ ప్రభుత్వానికి ప్రతిపాదించేలా కృషి చేస్తేనే వారు కోరుకుంటున్న పే స్కేల్ లభిస్తుందన్నారు. కాబట్టి సచివాలయాల ఉద్యోగులు అందరికీ ఒకే పే స్కేల్ డిమాండ్ చేయడం సమంజసం కాదని కాటంనేని భాస్కర్ తేల్చిచెప్పేశారు.














Click it and Unblock the Notifications
