ఏపీలో కార్పోరేషన్లు, మున్సిపాలిటీలకు పండగ- ఏకంగా రూ. 7470 కోట్లు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం (AP Govt) సిద్దమవుతోంది. ఇందులో ముందుగా పట్టణ స్థానిక సంస్థలైన 123 మున్సిపల్ కార్పోరేషనన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించబోతోంది. వీటిలో మెజార్టీ స్థానిక సంస్థల్ని చేజిక్కించుకునేందుకు వీలుగా కూటమి సర్కార్ పావులు కదుపుతోంది. ఇందుకోసం ఆయా చోట్ల పెండింగ్ లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనులను పూర్తి చేసేందుకు భారీ ప్రాజెక్టుకు క్లియర్ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 123 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో మౌలిక వసతుల కల్పన కోసం ₹7,469.46 కోట్ల భారీ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదల చేసింది.
వీటిలో 100 శాతం రోడ్డు అనుసంధానం చేపట్టనున్నారు. త్వరలో ఈ నిధులతో 123 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 4,388 కి.మీ రోడ్ల నిర్మాణం, అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.4,655.82 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. అలాగే రూ.509.12 కోట్లతో 541 కొత్త పార్కుల అభివృద్ధి, పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
వీటితో పాటు మరో రూ.247.28 కోట్లతో 20,340 కొత్త వీధి దీపాల ఏర్పాటు చేయనున్నారు. అలాగే రూ.87.78 కోట్లతో 1,186 కి.మీ రోడ్ మీడియన్ల (రోడ్డు మధ్యలో మొక్కలు ) సుందరీకరణ చేపట్టబోతున్నారు. ఈ పనులన్నీ నెల రోజుల్లో శరవేగంగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. నెల రోజుల్లో పూర్తి కాకపోయినా పనులు కొనసాగుతుంటే, ఎన్నికల్లో ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందనేది కూటమి ఉద్దేశంగా ఉంది.














Click it and Unblock the Notifications