మరో అడుగు ముందుకేసిన ఏపీ సర్కార్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సుపరిపాలనపై దృష్టి సారించింది. అన్ని శాఖలు, విభాగాల ద్వారా పౌర సేవలను మరంత సులభతరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది.
ఇప్పటికే రేషన్ షాపుల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంది. వాటిని పునరుద్ధరించింది. నెలలో 15 రోజులపాటు నిత్యావసర సరుకులను రేషన్ కార్డుదారులకు అందజేసేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ 15 రోజుల పాటు కూడా రెండు పూటలా పంపిణీ ఉంటుంది. ఈ మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేర్పులను చేపట్టింది. ఇవి అమలులోకి వచ్చాయి కూడా.

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసింది చంద్రబాబు ప్రభుత్వం. రియల్ టైమ్ పౌర-కేంద్రీకృత పాలనకు శ్రీకారం చుట్టింది. దీనికోసం అంతరిక్ష సాంకేతికతను వినియోగించుకోనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్టీజీఎస్ లో ఇస్రోను భాగస్వామ్యం చేసింది.
ఆర్టీజీఎస్- శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తో అయిదు సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో షార్ డైరెక్టర్ రాజరాజన్, ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రఖర్ జైన్.. ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్, ప్రజలకు సుపరిపాలనను అందించే దిశగా ఇస్రోను ప్రభుత్వంలో సాంకేతిక భాగస్వామిని చేయడం, ఆ ప్రతిష్ఠాత్మక సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న దక్షిణాదిన మొట్టమొదటి రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఇస్రోతో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోలేదు.
రియల్ టైమ్ పౌర కేంద్రీకృత పాలన కోసం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఈ ఒప్పందం ఓ మైలురాయి వంటిదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వ్యవసాయం, వాతావరణం, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక మొదలైన 42కు పైగా అప్లికేషన్లలో ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రీయ ఇన్‌పుట్‌లతో అవేర్ ప్లాట్ ఫామ్ ను మెరుగుపరుస్తుందని అన్నారు.
ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఎస్ఎంఎస్, వాట్సప్, మీడియా, సోషల్ మీడియా ద్వారా పౌరులు- ప్రభుత్వానికి రియల్-టైమ్ సలహాలు, సూచనలు అందించగలమని చంద్రబాబు తెలిపారు. ఉపగ్రహాలు, డ్రోన్లు, ఐఓటీ సెన్సార్లు, మొబైల్ ఫీడ్స్, సీసీటీవీల నుండి డేటాను ఏకీకృతం చేయడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications