ఏపీలో బిల్డర్లకు సర్కార్ భారీ గుడ్ న్యూస్..! 50 శాతం డిస్కౌంట్..!
ఏపీలో స్తిరాస్తి, భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కూటమి సర్కార్ (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఖాళీ స్థలాలకు ఇప్పటివరకూ చెల్లిస్తున్న పన్నులో భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ సగం పన్ను మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు కార్యరూపం ఇస్తూ ఇవాళ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భవన నిర్మాణదారులకు ఊరట లభించబోతోంది.
రాష్ట్రంలోని ఖాళీ స్థలాలకు పన్ను చెల్లింపులో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. భవన నిర్మాణ సమయంలో ఖాళీ స్థలం పన్నులో కేవలం 50 శాతం మాత్రమే చెల్లించేలా చట్టంలో ప్రభుత్వం ఇప్పటికే సవరణలు చేసింది.
అసెంబ్లీ ఆమోదించిన చట్ట సవరణకు అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ప్రకారం భవనం నిర్మాణం ప్రారంభం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చే వరకూ ఖాళీ స్థలం పన్ను లో 50 శాతం రాయితీ ఇవ్వబోతున్నారు

ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో భవన నిర్మాణాలు జరగకుండా ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ వాటికి పూర్తి పన్ను చెల్లించాల్సి రావడంపై ఎప్పటి నుంచో భవన నిర్మాణదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్డర్లు ఈ మేరకు పన్నులో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా అసెంబ్లీలో చట్ట సవరణ కూడా చేసింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ కావడంతో బిల్డర్లకు ఆ మేరకు ఊరట లభిస్తుంది.












Click it and Unblock the Notifications