చంద్రబాబుపై దాడి ఘటన పట్ల హైకోర్టు సీరియస్: స్వయంగా హాజరు కావాలంటూ డీజీపీకి ఆదేశాలు..!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న దాడి ఘటన అటు తిరిగి, ఇటు తిరిగి.. రాష్ట్ర పోలీసు యంత్రాంగం మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ దాడి వ్యవహారంలో హైకోర్టు సోమవారం రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్‌కు నోటీసులను జారీ చేసింది. స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. చంద్రబాబుపై దాడి చేయడానికి గల కారణాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని సూచించింది. దీనిపై డీజీపీ ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసినప్పటికీ.. వ్యక్తిగతంగా హాజరు కావాలని తాజాగా ఆదేశించింది.
విజయనగరం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుపై కిందటి నెల 27వ తేదీన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. విమానాశ్రయం నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరకుండా అడ్డు పడ్డారు. కారుపై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లను రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసి, వెనక్కి తిప్పి పంపించారు.

ఈ మొత్తం వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని తప్పు పట్టింది. పోలీసులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. అడ్డుకున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని, తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్ 151ను చంద్రబాబుపై ప్రయోగించారని అన్నారు. 151 కింద నోటీసులు ఇచ్చి, అరెస్టు చేశారని తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇదివరకే కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఈ కౌంటర్ అఫిడవిట్‌పై సోమవారం హైకోర్టు విచారణ నిర్వహించింది. పోలీసులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, కౌంటర్ అఫిడవిట్‌లో సమగ్ర వివరాలను లేవని అభిప్రాయపడింది. అందుకే స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. స్వయంగా హాజరు కావాలని, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications