40 ఇయర్స్ ఇండస్ట్రీకి అది కూడా తెలియదా..!!
గన్నవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జరిపిన ప్రతి దాడుల్లో గాయపడ్డ సీఐని హోం శాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. టీడీపీపై ఘాటు విమర్శలు చేశారు.
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య చోటు చేసుకున్నఘర్షణల అనంతరం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలను చేసుకుంటోన్నారు. ఈ దాడులకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కారణమంటూ వైసీపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. వైసీపీ నాయకులను పట్టాభి- వ్యక్తిగతంగా దూషించాడని, రెచ్చగొట్టేలా ప్రవర్తించాడంటూ సాక్ష్యాధారాలను చూపిస్తోన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు జరిపిన ప్రతిదాడుల్లో గన్నవరం సర్కిల్ ఇన్ స్పెక్టర్ కనకారావు గాయపడ్డారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పట్టాభితో పాటు 16 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారు. వారిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.
ఈ దాడుల్లో గాయపడిన సీఐ కనకారావును హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తోన్నారని, రూల్స్ ను పాటిస్తోన్నారని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి విధుల్లో పాల్గొంటోన్నారని, అలాంటి వారిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెదిరింపులకు దిగుతుండటం అనాగరిక చర్యగా అబివర్ణించారు.

రాజకీయాల్లో తనకు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబుకు- పోలీసులను గౌరవించాలనే విషయం కూడా తెలియదా? అంటూ నిలదీశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నానంటూ డబ్బా కొట్టుకునే చంద్రబాబు పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని అన్నారు. ఏదో ఒక కారణంతో ప్రభుత్వంపై బురద జల్లడానికే చంద్రబాబు విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
గెదే చెనులో మెస్తే దూడ ఎక్కడ మేస్తుందో అనే సామెతను తలపించేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తోన్నారంటూ తానేటి వనతి ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేష్ స్వయంగా పోలీసులను బెదిరిస్తోంటే- ఆ పార్టీ నాయకులు ఏకంగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తనపై ధర్డ్ డిగ్రీ జరిగిందంటూ పట్టాభి ఆరోపించారని, అవన్నీ అసత్యాలేననేది మెడికల్ రిపోర్టులో తేలిందని చెప్పారు. పట్టాభిని కొట్టలేదంటూ స్వయంగా న్యాయస్థానమే ధృవీకరించిందని చెప్పారు.












Click it and Unblock the Notifications