AP Local Body Elections: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల బంతి..! తేడా వస్తే సర్కార్ ప్లాన్ బీ..!
ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణకు సిద్ధమవుతున్న కూటమి సర్కార్.. అంతకంటే ముందే పట్టణ, గ్రామీణ స్ధానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచింది. పట్టణ స్థానిక సంస్దల్లో 34 శాతానికి, గ్రామ స్థానిక సంస్దల్లో 33.33 శాతానికి బీసీ రిజర్వేషన్లను పెంచుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో పాటు అసెంబ్లీలో చట్ట సవరణ కూడా చేసింది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో లాయర్ తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ జరపబోతోంది.
దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు ఇస్తున్న రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ఆధారంగా గతంలో ఏపీలో స్దానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచినా, ఆ తర్వాత తగ్గించుకోవాల్సి వచ్చింది. వీటి ఆధారంగానే పలు ఎన్నికలు జరిగాయి. ఇదంతా తెలిసినా రాజకీయ లబ్ది కోసం కూటమి సర్కార్ మరోసారి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను హడావిడిగా పెంచి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో వీటిని కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే సుప్రీంకోర్టు గత తీర్పును హైకోర్టు కూడా ఫాలో అయితే ఈ రిజర్వేషన్లను కొట్టేసే అవకాశం ఉంది.

దీంతో కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. ఒకవేళ తాము చేసిన బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు కొట్టేస్తే.. ప్రత్యామ్నాయంగా అంతే శాతం రిజర్వేషన్లను టికెట్ల కేటాయింపులో అమలు చేసేందుకు కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. తద్వారా బీసీలకు పెంచిన రిజర్వేషన్ల ఆధారంగా టికెట్లు కేటాయించినట్లు, హైకోర్టు అంగీకరించకపోయినా వారికి న్యాయం చేసినట్లు చెప్పుకునే వీలు ఉంది. దీంతో హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తదుపరి న్యాయపోరాటం చేసేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications