ఏపీలో జిల్లా, మండల పరిషత్ ల నియామక తేదీ ఖరారు-ఎస్ఈసీ కీలక ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాల ప్రకారం ఎన్నికైన సభ్యులతో పాటు కోఆప్షన్ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఛైర్ పర్సన్ లు, వైస్ ఛైర్ పర్సన్లు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలోని మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల తొలి సమావేశాల నిర్వహణ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ నెల 19వ తేదీన మండల ప్రజా పరిషత్‌లకు, 20వ తేదీన జిల్లా ప్రజా పరిషత్‌లకు తొలి సమావేశాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (AP SEC) అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ) ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం మండల పరిషత్‌ల కో-ఆప్టెడ్ సభ్యులు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం నవంబర్ 19న, జిల్లా పరిషత్‌ల కో-ఆప్టెడ్ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌ల ఎన్నిక కోసం నవంబర్ 20న ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు.
1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్లు 153(3), 181(4) ప్రకారం సాధారణ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం ఎన్నికైన సభ్యులతో మండల, జిల్లా పరిషత్‌ల తొలి సమావేశాలు నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్షులు, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌ల ఎన్నిక చేపట్టాల్సి ఉంటుందన్నారు.

అలాగే ఈ చట్టంలోని సెక్షన్లు 153(5), 154(ii), 181(6), 182(ii) ప్రకారం మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికైన సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, చైర్‌పర్సన్‌లు, వైస్‌చైర్‌పర్సన్‌ల ఐదేళ్ల పదవీకాలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించిన తొలి సమావేశం తేదీ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243Kతో పాటు 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ నవంబర్ 19, 2026ను మండల ప్రజా పరిషత్‌ల తొలి సమావేశ తేదీగా, నవంబర్ 20, 2026ను జిల్లా ప్రజా పరిషత్‌ల తొలి సమావేశ తేదీగా నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఈ తేదీల నుంచే సంబంధిత మండల, జిల్లా పరిషత్‌ల ప్రజాప్రతినిధుల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభమవుతుందని తెలిపారు.













Click it and Unblock the Notifications
