పిడుగులు పడే ఛాన్స్.. బలహీన పడుతున్న అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నేడు (ఫిబ్రవరి 24, 2026) ఉదయం కూడా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ ప్రస్తుతం తూర్పు దిశగా కదులుతోందని, రాబోయే 24 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు దక్షిణ అంతర కర్ణాటక నుంచి మరాఠ్వాడా వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కూడా వాతావరణ మార్పులకు తోడ్పడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీస్తున్నాయి.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, ప్రకాశం మరియు రాయలసీమలోని నంద్యాల తదితర ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు అక్కడక్కడ సంభవించవచ్చని, అయితే ఎల్లుండి (గురువారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని అధికారులు అంచనా వేశారు. కనిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రం రాబోయే మూడు రోజుల్లో పెద్దగా మార్పులు ఉండబోవు.

AP Weather Update రైతులకు హెచ్చరికలు:
వర్షాలతో పాటు పిడుగులు పడే ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పిడుగుల పట్ల ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు మరియు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండల నుండి తాత్కాలిక ఉపశమనం:
ఇప్పటికే వేసవి ప్రభావం మొదలై ఎండలు మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, సాయంత్రం ఆకాశం మేఘావృతమై కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా సాలూరు వంటి ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రజలకు ఉక్కపోత నుండి కాస్త ఉపశమనం లభించింది. ఈ అకాల వర్షాలు రాబోయే రెండు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications