YS Sharmila: వైఎస్ షర్మిల పోటీ చేసే రెండు సీట్లు ఇవేనా? అవే ఎందుకంటే?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఈసారి 175 అసెంబ్లీ సీట్లలో, 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని నిన్న బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రకటించిన షర్మిల.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చేందుకు వీలుగా తాను రెండు సీట్ల నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.
పీసీసీ ఛీఫ్ గా నియామకం, బాధ్యతల స్వీకరణ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల.. అదే సమయంలో తాను పోటీ చేసే నియోజకవర్గాల్ని ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఓవైపు తన సొంత గడ్డ అయిన రాయలసీమతో పాటు అమరావతి ప్రాంతంపై ఫోకస్ పెడుతున్న షర్మిల.. అందుకు తగినట్లే రెండు ప్రాంతాల్లోనూ పోటీకి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల పోటీకి పరిశీలిస్తున్న సీట్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు తన తండ్రి వైఎస్సార్, ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీటులో పోటీ కోసం ప్లాన్ చేస్తున్న షర్మిల.. తన సోదరి, బాబాయ్ వివేకా కుమార్తె సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటు వదిలిపెట్టే అవకాశం ఉంది. లేకపోతే పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలో రెండు సీట్లను పోటీకి పరిశీలిస్తున్నారు. ఇందులో విజయవాడ తూర్పు సీటుతో పాటు గుంటూరు పశ్చిమ సీటు ఉన్నాయి. ఈ రెండు సీట్లను షర్మిల పోటీకి పరిశీలించడం వెనుక కీలక కారణాలున్నాయి.
విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమ సీట్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. ఇక్కడ గతంలో ఆరేసి సార్లు కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసుకుంది. కానీ గత దశాబ్దకాలంగా మారిన పరిస్ధితుల్లో వీటిని ఇతర పార్టీలు గెల్చుకుంటున్నాయి. ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఓటు బ్యాంకులు కూడా తారుమారు అయ్యాయి. కానీ ఇప్పుడు తిరిగి షర్మిక అక్కడ పోటీ చేస్తే తిరిగి ఆ క్యాడర్ కాంగ్రెస్ లోకి రావడంతో పాటు గెలుపు సునాయాసం అవుతుందని భావిస్తున్నారు.
మరోవైపు షర్మిల విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఇక్కడ ఇప్పటికే వైసీపీ ఇన్ ఛార్జ్ లుగా ప్రకటించిన దేవినేని అవినామష్, విడదల రజనీలను మార్చేందుకు వైసీపీ సిద్ధపడొచ్చన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే షర్మిల పోటీపై క్లారిటీ వచ్చాక జగన్ ఈ సీట్లలో మార్పులు చేయాలా వద్దా అన్న దానిపై క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications