APSRTC బంపర్ ఆఫర్ - 10 రోజుల టికెట్ ధరకే 30 రోజుల జర్నీ..!!
APSRTC కీలక అప్డేట్ ఇచ్చింది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ఏరో ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 10 రోజుల ఛార్జీతో 30 రోజుల పాటు ప్రయాణం చేసేందుకు వెసులు బాటు కల్పించింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన ఈ నెలవారీ సీజన్ పాస్‌లను భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లోని అరైవల్ బ్లాక్ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌తో పాటు విశాఖపట్నంలోని ప్రధాన బస్టాండ్లలో కూడా అందుబాటులో ఉంచారు.
ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భోగాపురం 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' వైపు ప్రయాణికుల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ ఉద్యోగుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేకంగా నడుపుతున్న 'ఏరో ఏసీ ఎక్స్‌ప్రెస్' బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. కేవలం 10 రోజుల ప్రయాణ ఛార్జీ చెల్లిస్తే చాలు, ఏకంగా 30 రోజుల పాటు ప్రయాణించేలా సరికొత్త నెలవారీ సీజన్ పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం మొత్తం 20 బస్సులు ఎయిర్‌పోర్ట్‌కు నడుస్తున్నాయి. పాత గాజువాక నుంచి నేషనల్ హైవే మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు రోజూ 10 ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తుంగా.. పాత గాజువాక నుంచి బీచ్ రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లకు మరో 10 బస్సులు ప్రస్తుతం నడుస్తున్నాయి.

ప్రయాణీకులకు సౌకర్యవంతంగా
ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడుతున్నాయని అధికారులు చెబుతు న్నారు. ప్రతీ 15 నిమిషాలకు ఒక్కొ బస్ అందుబాటులో ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసారు. బోర్డింగ్ పాయింట్‌ను బట్టి బస్ చార్జీల ధరలు మారతాయి. గురుద్వారా నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు బస్ పాస్ ధర రూ.6 వేలుగా ఉండగా.. ఐటీ హిల్స్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు రూ.5 వేలు, ఆనందపురం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు రూ.3 వేలు, ఎయిర్ పోర్ట్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్‌కు రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఇక జనరల్ బస్ పాస్ ధర రూ.7 వేలుగా ఆర్టీసీ ఫిక్స్ చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన తరువాత ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనికి తగినట్లుగా ప్రభుత్వం రహదారులను అభివృద్ధి చేసి, అధునాతన మౌలిక వసతులను కల్పించింది.













Click it and Unblock the Notifications
