హిందూపుర్: బాలకృష్ణకి బాబు ఓకే, 17న నామినేషన్?
హైదరాబాద్: హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణకు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నుండి తాను పోటీ చేసే సీటుపై హామీ లభించిందా? అంటే అవుననే అంటున్నారు. బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేస్తే అక్కడి నుండి ఇచ్చేందుకు సిద్ధమని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని ఉవ్వీళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు దానిపై బాబు నుండి హామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. బుధవారం చంద్రబాబుతో బాలయ్య భేటీ అయ్యారు. తాను పోటీ చేసే స్థానంతో పాటు... రాజకీయ అంశాల పైన చర్చించారని సమాచారం. ఇదే సమయంలో తాను హిందూపురం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పారట. దానికి బాబు అంగీకరించారని అంటున్నారు. కాగా, బాలయ్య 17వ తేదీన నామినేషన్ వేసే అవకాశాలున్నాయంటున్నారు.

కాగా తాను లోకసభకు పోటీ చేయనని, దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. రాహుల్ గాంధీకి అవగాహన, అర్థం చేసుకునే శక్తి ఏమాత్రం లేదన్నారు. జగన్ గెలిస్తే కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతుందన్నారు.
ఉద్యమ పార్టీ అన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో అభ్యర్థులకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవన్నారు. ప్రజలు ఆలోచించి.. అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోవాలన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంకు వస్తే ఆహ్వానిస్తామని, బాలకృష్ణ పోటీపై ఆయనతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.












Click it and Unblock the Notifications