రేవంత్ రెడ్డిపై అభిమానాన్ని దాచుకోలేకపోతున్న తెలుగుదేశం: ఏపీలో ఫ్లెక్సీలు, బ్యానర్లు
Revanth Reddy: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంకొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు తరలి రానున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క నియమితులు కానున్నారు. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో- ఏపీలో కొన్ని చోట్ల రేవంత్ రెడ్డి పేరు మీద విస్తృతంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రత్యేకించి- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అవి కనిపించాయి. ఆయా జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిని కట్టారు. రేవంత్‌కు శుభాకాంక్షలను తెలియజేశారు.
గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పనిచేశారు రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్‌బై చెప్పారు. 2017లో కాంగ్రెస్‌లో చేరారు. క్రమంగా పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదిగారు. పార్టీని విజయం వైపు నడిపించగలిగారు.












Click it and Unblock the Notifications