విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంకటంగా బెంజిల్ సర్కిల్: బెజవాడ ఫ్లై ఓవరు అవుతుందా?

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు రాజధాని.. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతికి మరోవైపున కొలువుదీరి ఉన్నది. రెండు నగరాలు కృష్ణా నదీ తీరాన్నే ఉన్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు రాజధాని.. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతికి మరోవైపున కొలువుదీరి ఉన్నది. రెండు నగరాలు కృష్ణా నదీ తీరాన్నే ఉన్నాయి. అదే విజయవాడ నగరం. రాజధాని అమరావతి నిర్మాణంలో ఉన్నా.. బెజవాడ సిటీ అది.

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీయే) పరిధిలో ఉన్న విజయవాడ నగర వాసులంతా ప్రతి రోజూ 'బెంజి' సర్కిల్' మీదుగా తమ వృత్తి, వ్యాపారాల నిమిత్తం వెళ్లడం తప్పనిసరి. ఒకప్పుడు బెంజి సర్కిల్‌ మీదుగా దూసుకెళ్లే వారు సైతం ఇప్పుడు కనీసం పావుగంటపాటు జంక్షన్‌లో జపం చేయాల్సిన పరిస్థితి. నగరానికి ల్యాండ్‌ మార్కు వంటి ఈ జంక్షన్‌ గురించి ఒకప్పుడు గొప్పగా చెప్పుకొనే బెజవాడ వాసులు ఇప్పుడు ఆ పేరు పలకాలంటేనే బెంబేలెత్తుతున్నారు.

సీఆర్డీయే పరిధిలో ఉన్న విజయవాడలో ట్రాఫిక్‌ దుస్థితికి బెంజి సర్కిల్‌ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరంగా విజయవాడ పేరొందింది. కానీ నగర రహదారులు మాత్రం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. నగరం పెరుగుతున్న కొద్దీ రహదారులు మరింత ఇరుకయ్యాయి. అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం.. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇక్కడికి తరలి రావడంతో నగరంపై వాహనాల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగిపోయింది.

కోస్తాంధ్రకు హోల్ సేల్ మార్కెట్ కేంద్రం విజయవాడ

కోస్తాంధ్రకు హోల్ సేల్ మార్కెట్ కేంద్రం విజయవాడ

ఏడాదిలోగా సుమారు లక్ష మంది ఉద్యోగ, వ్యాపార నిమిత్తం నగరానికి వలస వచ్చారు. ఇక విజయవాడ హోల్‌సేల్‌ మార్కెట్‌కు కేంద్రం కావడంతో కోస్తా, సీమ జిల్లాల నుంచి వ్యాపారుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికశాతం విజయవాడలోనే ఏర్పాటు చేయడంతో ఆయా కార్యాలయాలకు పనులపై వచ్చేవారి సంఖ్య సైతం పెరిగింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రహదారుల విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకుండా విస్తరణ పనులు చేపట్టడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ గాడితప్పింది. ఫలితంగా నగరవాసులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు.

నాలుగు లేన్లలో రోడ్ల విస్తరణ

నాలుగు లేన్లలో రోడ్ల విస్తరణ

విజయవాడ నగరానికి ఉన్న మూడు ప్రధాన రూట్లల్లో రెండు జాతీయ రహదార్లు (హైదరాబాద్‌ - విజయవాడ, కోల్‌కతా - చెన్నై) కాగా మరొకటి బందరు రోడ్డు. ఈ మూడింటిపైనే 90 శాతం వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు ఇవి ఇరుకిరుగ్గా తయారయ్యాయి. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం రెండు లేన్లల్లో ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా మారుస్తున్నారు. సుమారు ఏడాదికిపైగా ఈ పనులు సాగుతున్నాయి. ఫలితంగా విజయవాడ- బందర్ రోడ్డులో వెళ్లే వారికి ట్రాఫిక్‌ కష్టాలు షరా మామూలయ్యాయి. ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది.

వాహనాల రద్దీ తీవ్రతరం

వాహనాల రద్దీ తీవ్రతరం

బెజవాడకు ఒక ఇంటర్‌ చేంజ్‌ జంక్షన్ బెంజి సర్కిల్‌. పశ్చిమ కృష్ణావాసులు తూర్పు కృష్ణాకు వెళ్లాలి అన్నా, తూర్పు కృష్ణావాసులు పశ్చిమ కృష్ణాకు వెళ్లాలన్నా ఈ జంక్షన్‌ దాటాలి. జాతీయ రహదారి ఇక్కడే అనుసంధానం అవుతుంది. ఫలితంగా ఈ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. బెంజి సర్కిల్‌ కూడలిలో ఒకసారి రెడ్‌ సిగ్నల్‌ పడిదంటే వాహనాలు కనుచూపు దాటిపోయి స్తంభించిపోతాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన ఇటీవలే బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభమయ్యాయి. బెంజి సర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు ఈ పనులు జరుగుతుండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.

పూర్తిగానీ దుర్గగుడిపై ఫ్లైఓవర్

పూర్తిగానీ దుర్గగుడిపై ఫ్లైఓవర్

దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తికాక హైదరాబాద్‌ నుంచి బెజవాడ సిటీకి వచ్చేవారికే కాదు ఇబ్రహీపట్నం, భవానీపురంలో ఉండే వారికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలను చనమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌, మరికొన్ని వాహనాలను రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర నగరం చుట్టూ తిరిగి నగరంలోకి ప్రవేశించాల్సిన దుస్థితి. చనుమోలు వెంకట్రావు ఫ్లైవోర్‌ వద్ద తరచూ గంటలకొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను చిట్టినగర్‌, సొరంగం మార్గం వైపు మళ్లించడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు నిత్యకృత్యం అయ్యాయి.

తరుచుగా నిలిచిపోతున్న ట్రాఫిక్

తరుచుగా నిలిచిపోతున్న ట్రాఫిక్

కృష్ణలంక వద్ద పుష్కరాలకు ముందు చేపట్టిన హైదరాబాద్‌ రహదారిపై సబ్‌వే నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతానికి ఒకవైపు మాత్రమే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. మరోపక్క వంతెన నిర్మాణానికి అసలు అడుగులే పడలేదు. కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారిపై కృష్ణలంక వద్ద కృష్ణా నదిపై వారధి నిర్మించినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. వారధికి అవతలి వైపున ఆరు లేన్ల రహదారి నిర్మించినా, వారధిని మాత్రం రెండు లేన్లల్లో నిర్మించారు. దీంతో ఇక్కడ తరచూ పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోతోంది.

గోదావరి జిల్లాల వాసుల దుస్థితి ఇది

గోదావరి జిల్లాల వాసుల దుస్థితి ఇది

పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను నుంచి గుంటూరు జిల్లాలోని ఖాజ గ్రామం వరకు బైపాస్‌ రహదారిని నిర్మించడానికి గామన్‌ ఇండియా కంపెనీ టెండర్లు దక్కించుకుని ఏళ్లు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సంస్థను ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రయోజనం శూన్యం. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడకు భారీ వాహనాల తాకిడి ఉండదు. బెజవాడలో ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల పర్యటనలు ఉన్నప్పుడు పోలీసులు ముందస్తుగా అన్ని వైపులా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. ఆ సమయంలో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులు ఉంటేనే.. లేదంటే అంతే సంగతులు

ట్రాఫిక్ పోలీసులు ఉంటేనే.. లేదంటే అంతే సంగతులు

బెజవాడలో సిగ్నలింగ్‌ వ్యవస్థ దారుణంగా ఉంది. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని కూడళ్లలో ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు ఉంటేనే పరిస్థితి అదుపులో ఉంటుంది. వారు లేకపోతే అన్ని రహదారులూ అస్తవ్యస్తమే. హైదరాబాద్‌ వంటి చోట్ల ట్రాఫిక్‌ సిబ్బంది రహదారులపై లేకపోయినా సిగ్నలింగ్‌ వ్యవస్థ మొత్తం ట్రాఫిక్‌ను నడిపించేస్తుంది. నగరంలో బెంజి సర్కిల్‌, జాతీయ రహదారి, బందరు రోడ్డులో తప్ప ఇంకెక్కడా సిగ్నళ్లు కనిపించవు. ట్రాఫిక్‌ నిబంధనల అమలులో పోలీసులు కఠినంగా వ్యవహరించక కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. అయిదో నంబర్‌ రూట్, కాళేశ్వరరావు మార్కెట్‌, వన్‌టౌన్‌, చిట్టినగర్‌, సత్యనారాయణపురం ప్రాంతాల్లో వన్‌వే అమలులో ఉన్నా వాహనదారులు ఈ నిబంధనను పాటించని పరిస్థితి. విజయవాడ నగరంలో పార్కింగ్‌ కూడా ప్రధాన సమస్యగా మారింది. ప్రధానమైన బందరు రోడ్డులోని వాణిజ్య సముదాయాలకు సైతం సరైన పార్కింగ్‌ వ్యవస్థ లేదు. దీంతో రహదారులపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. ఈ పరిస్థితి ట్రాఫిక్‌ కష్టాలను మరింత పెంచుతోంది.

ట్రాఫిక్ రద్దీ ఇలా ఉంటుంది

ట్రాఫిక్ రద్దీ ఇలా ఉంటుంది

విజయవాడలో అన్ని పాఠశాలలు, కళాశాలలు ఒకే సమయానికి ప్రారంభమైతే ఒకేసారి వదులుతున్నారు. దీనివల్ల సాయంత్రం ట్రాఫిక్‌ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. విద్యాసంస్థలను వదిలే విషయంలో ఒక్కో సంస్థ ఒక్కో సమయాన్ని పాటించేలా చూస్తే ట్రాఫిక్‌ సమస్యకు కొంత వరకు చెక్‌ పెట్టవచ్చు. మహాత్మాగాంధీ రోడ్డులో పోలీసు కంట్రోల్‌ రూం నుంచి బెంజి సర్కిల్‌ వరకు ట్రాఫిక్‌ పోలీసులు కొన్ని యూ టర్న్‌లు ఏర్పాటు చేశారు. నగర వాసులకు వీటిపై కొంత అవగాహన ఉన్నా, పొరుగు ప్రాంతాల వారికి ఇది కాస్తంత ఇబ్బందికరమే. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ యూటర్న్‌లు ఉన్న ప్రాంతాల్లో సూచికలు ఏర్పాటు చేస్తే వాహనదారులకు స్పష్టత ఉంటుంది.
అంతర్గత రహదారుల్లో వన్‌వేలను సక్రమంగా అమలు చేయాలి. ఇక ఎంజీ రోడ్డులో పార్కింగ్‌కు స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలి. ప్రధాన మార్గాల్లో రోడ్డు విస్తరణ, ఫ్లైవోవర్‌ నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.

బీఆర్టీఎస్ రద్దుకు ఇవీ కారణాలు

బీఆర్టీఎస్ రద్దుకు ఇవీ కారణాలు

బీఆర్టీఎస్‌... బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం. ప్రయాణికులు దిగే చోట తప్ప, ఇంకెక్కడా బస్సు ఆగకూడదు. నిమిషాల వ్యవధిలో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేపట్టారు. సరైన ప్రణాళిక లేక దీని లక్ష్యం నీరు గారిపోయింది. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి సత్యనారాయణపురంలోని బీఆర్టీఎస్‌ రోడ్డు వరకు, బందరు రోడ్లపై బీఆర్టీఎస్‌ అమలు చేయాలని భావించారు. రూ.150 కోట్లతో విశాలమైన రహదారిని నిర్మించారు. రహదారికి కుడి, ఎడమ వైపున మామూలు వాహనాలు, మధ్యలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించేలా దీన్ని డిజైన్‌ చేశారు. ఈ రహదారిలో నాలుగైదు కూడళ్లు ఉండటం, తరచుగా సిగ్నళ్లు పడుతుండటంతో బీఆర్టీఎస్‌కు బ్రేక్‌లు పడ్డాయి. రోడ్డు విస్తరణ జరిగితేనే దీని అమలు చేయడం సాధ్యం. విస్తరణ లేకుండా కుడి, ఎడమ వైపులా బారికేడ్లు పెట్టి కొంతకాలం బస్సులు నడిపారు. ఓ ప్రమాదం జరగడంతో బీఆర్టీఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు.

English summary
Vijayawada city had trouble in traffic problems while additionally Navyandra Pradesh capital also came here. In this concept total bezwada people faces so many problems. CM Chandrababu & other VIP's comes into Vijayawada city will additional traffic burden for people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X