డిసిఎం రేసులో యనమల, నారాయణ, కెఈ కృష్ణమూర్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బిసి వర్గాలకు ఒకటి, కాపు సామాజిక వర్గాలకు ఒకటి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, నారాయణ విద్యా సంస్థల నేత నారాయణ, టిడిపి మరో సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి పేర్లు వినిపిస్తున్నాయి.
ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో బీసీల నుంచి పోటీ తక్కువగా ఉండగా.. కాపు సామాజిక వర్గం నుంచి మాత్రం ఎక్కువగా ఉందట. పార్టీలో ఉన్న బీసీ నేతల్లో సీనియర్లు ఇద్దరున్నారు. ఒకరు శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కాగా మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి. ఇద్దరూ పొలిట్‌బ్యూరో సభ్యులే. బీసీల నుంచి కెఈకి అవకాశం ఉంటుందని భావిస్తున్నప్పటికీ... యనమలకు ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు.

రెండు ప్రాంతాలకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలన్న అభిప్రాయం ఉంటే కేఈకి అవకాశాలు పెరగవచ్చని అంటున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవి రాయలసీమకు ఉన్నందువల్ల ఉప ముఖ్యమంత్రి మళ్లీ అదే ప్రాంతానికి అవసరం లేదన్న వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది. ఉప ముఖ్యమంత్రి పదవి దక్కినా దక్కకపోయినా ఈ ఇద్దరు నేతలకు వారి వారి జిల్లాల నుంచి మంత్రి పదవులు మాత్రం ఖాయంగా లభిస్తాయి. యనమలకు ఛాన్స్ లేకుంటే ఆర్థిక శాఖ ఇవ్వవచ్చు.
ఇక, కాపు సామాజిక వర్గంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి ఆశావహుల సంఖ్య బాగా అధికంగా ఉంది. మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస రావు, మండలి బుద్ధప్రసాద్, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి తిరిగి వచ్చారు. వీరికి ఇది మైనస్ అంటున్నారు. బుద్ధప్రసాద్ ఎన్నికల సమయంలోనే మొదటిసారి టిడిపిలో చేరారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఇస్తారా అని మొదటి నుండి ఉన్న వారు ప్రశ్నించే అవకాశముంది.
ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చినరాజప్ప పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే, యనమల, చినరాజప్ప ఇద్దరూ తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారే. యనమలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే అదే జిల్లా నుంచి మరొకరికి అవకాశం రాదు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం లేదు. దీంతో, తాజాగా నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ పేరు ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రచారంలోకి వచ్చింది.
కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ లేరు. ఎన్నికల ముందు రాజ్యసభ సీటు తీసుకొనే అవకాశం వచ్చినా పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తనకేమీ అక్కర్లేదని చెప్పి పక్కకు తప్పుకొన్నారు. సుదీర్ఘకాలంగా చంద్రబాబును అంటిపెట్టుకొని ఉన్న నారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications