బొత్స అనూషపై సోషల్ మీడియా ట్రోలింగ్స్- హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత, మండలి విపక్ష నేత కూడా అయిన బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష (botcha Anusha) ఈ మధ్యే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో బొత్స అనూషను టార్గెట్ చేస్తూ ఆమె రాజకీయ ప్రత్యర్దులు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ప్రారంభించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వీటిని అడ్డుకోవాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
బొత్స అనూషకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో పలు ట్రోలింగ్ వీడియోలు ఉన్నాయి. వీటిని తొలగించాలని హైకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ వీడియోలు పెట్టిన వారిపై సైతం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే భవిష్యత్తులో బొత్స అనూషపై పెట్టే వీడియోలపైనా పిటిషనర్ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అంటే ఇకపై ఎవరైనా బొత్స అనూషను విమర్శిస్తూ వీడియోలు పెడితే వాటినీ తొలగించడంతో పాటు వీటిని పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

అంతకు ముందు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ పలువురు పెట్టిన వీడియోలపై చర్యలు తీసుకోవాలంటూ బొత్స అనూష హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పలు ప్రభుత్వ విభాగాలతో పాటు మెటాను, యూట్యూబ్ ను కూడా ప్రతివాదులుగా చేర్చారు. వీటిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం లేకపోవడాన్ని ఆమె పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తనపై అభ్యంతరకరంగా పెట్టిన వీడియోల్ని తొలగించడంతో పాటు వీటిని భవిష్యత్ కేసు అవసరాల కోసం భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై వాదోపవాదాలు విన్న హైకోర్టు.. ఏపీ పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేసింది.













Click it and Unblock the Notifications
