ఏపీలో మద్యంపై పురందేశ్వరిది కంఠశోషేనా ? తెలంగాణ ఎఫెక్ట్ తో కేంద్రం మౌనం !
ఏపీలో మద్యం తయారీ, అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వానికి మద్యం తయారీదారుల వివరాలు కోరిన ఆమె.. ఇవ్వకపోవడంతో తానే కొన్ని పేర్లు బయటికి తీశారు. వీరిలో ఇద్దరు వైసీపీ ఎంపీల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రాన్ని కూడా చర్యలు తీసుకోవాలని పురందేశ్వరి కోరారు. అయితే కేంద్రం మాత్రం దీనిపై వేచి చూసే ధోరణి అనుసరిస్తోంది. దీని వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో మద్యం స్కాం జరిగిందని పురందేశ్వరి మొత్తుకుంటున్నా కేంద్రం నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. దీని వెనుక వైసీపీ-బీజేపీ బంధం ఓ కారణమైతే అంతకు మించిన కారణం మరొకటి కనిపిస్తోంది. తెలంగాణలో ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించి బీజేపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ చర్యలకు వచ్చేసరికి మాత్రం ఏమీ చేయలేని పరిస్ధితి ఎదురైంది. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదంతా చివరికి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కొంపముంచుతోంది.

గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఉన్నారని ఆరోపించిన బీజేపీ జాతీయ నేతలు, త్వరలో వీరంతా సీబీఐ అరెస్టుతో జైలుకెళ్లక తప్పదని బహిరంగంగానే తేల్చేశారు. ఆ తర్వాత సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ సిండికేట్ పాత్ర కీలకమని, అందులోనూ కవిత పాత్ర కీలకమని ఆరోపించింది. ఇవే అభియోగాలతో కోర్టులకు ఛార్జిషీట్లు కూడా సమర్పించింది. కానీ కవితను మాత్రం అరెస్టు చేయలేకపోయింది. సీబీఐ, ఈడీ అంటూ హడావిడి చేసి లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు తథ్యమని ప్రచారం చేసుకున్నా వాస్తవంలో ఏమీ చేయలేదు. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ బంధం వల్లే కవిత అరెస్టు జరగలేదన్న ప్రచారం తెలంగాణ పల్లెలకు కూడా చేరిపోయింది. ఇది ఇరుపార్టీలకు నష్టం చేసింది.
ఇప్పుడు ఏపీలో మద్యం స్కాం పేరుతో వివరాలు బయటపెడుతున్న పురంధేశ్వరి ఎలాగైనా అధికార వైసీపీపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కానీ పురందేశ్వరి బయటపెట్టే వివరాలతో కేంద్రం చర్యలు తీసుకునే పరిస్ధితి ఉందా అంటే గ్యారంటీ లేదు. ఒకవేళ పురందేశ్వరి ఒత్తిడితో సీబీఐనో, ఈడీనో పంపినా చివరికి కవిత తరహాలో తేలిపోతే అప్పుడు తమతో పాటు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న వైసీపీ కూడా మునగడం ఖాయం. అందుకే బీజేపీ అధిష్టానం, కేంద్రం ఎన్నికలకు ముందు మద్యం స్కాంపై దూకుడుగా ముందుకెళ్లే పరిస్ధితులు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications