ఏబీ వెంకటేశ్వర రావుపై చర్యల విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన కేంద్రం..!!
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుపై శాఖాపరమైన చర్యలను తీసుకోవడానికి కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది.
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు మరోసారి చుక్కెదురైంది. ఇదివరకు ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్ ఇది. విచారణ చేపట్టడానికి అవసరమైన సమగ్ర సమాచారం గానీ, ఇతర వివరాలు గానీ ఇందులో లేవని హైకోర్టు భావించింది.
కోర్టు ధిక్కారణ కేసు కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఇదివరకు ఏబీ వెంకటేశ్వర రావు ఈ పిటీషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన అపాయింట్‌మెంట్ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ప్రభుత్వ వాదనలను విన్న తరువాత ఈ పిటీషన్ ను కొట్టేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. ఆ తరువాత మళ్లీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఆయనపై శాఖాపరమైన చర్యలను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతులు లభించినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి లిఖితపూరకంగా తెలియజేసిందనే ప్రచారం జరుగుతోంది. పదవీ విరమణ చేసేంత వరకు ఏబీ వెంకటేశ్వర రావుకు ఇంక్రిమెంట్లను మంజూరు చేయొద్దని కేంద్రం సూచించినట్లు చెబుతున్నారు.
తదుపరి చర్యల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)ని సంప్రదించవచ్చని సూచించిందని అంటున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోగా వ్యవహరించిన సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్నాయి.
ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతో ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఇప్పుడు మళ్లీ కేంద్రమే ప్రభుత్వమే ఆయనపై చర్యలు తీసుకోవడానికి అంగీకరించిన నేపథ్యంలో- ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications