పార్టీ ముఖ్యులకు చంద్రబాబు పిలుపు - కీలక మార్పులు, రంగం సిద్దం..!!
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. టీడీపీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి నిర్ణయించారు. కూటమిలో భాగస్వామి గా ఉంటూ అమలు చేయాల్సిన కార్యాచరణ పైన నిర్ణయించనున్నారు. అదే విధంగా పార్టీలో సంస్థాగత ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ జాతీయ కమిటీలో మార్పులు పైన చర్చించనున్నారు. ఇదే సమయంలో పాలనా అంశాలు.. ప్రజాభిప్రాయం.. భవిష్యత్ కార్యాచరణ పైనా చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
పాలిట్ బ్యూరో భేటీ
టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం ఈ సారి ఆసక్తి కరంగా మారుతోంది. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్న వేళ.. పార్టీ పరంగా మార్పులకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ లో సంస్థాగత ఎన్నికలతో పాటుగా జాతీయ కమిటీలోనూ మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. దీని పైన ఇప్పటికే లోకేష్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మూడు సార్లు ఒకే పదవిలో కొనసాగుతున్న వారు తప్పుకుంటారని తేల్చి చెప్పారు. అందుతూ తనతో పాటుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారని స్పష్టత ఇచ్చారు. పార్టీ ఇచ్చే బాధ్యతలను స్వీకరిస్తానని చెబుతూ.. పరోక్షం గా తన భవిష్యత్ పదవి గురించి చెప్పే ప్రయత్నం చేసారు.

ఇలా ముందకెళ్దాం
ఇప్పుడు పాలిట్ బ్యూరో సమావేశంలో ఏపీలో కూటమి భాగస్వామిగా ఉంటూ.. టీడీపీ భవిష్యత్ కోసం తీసుకోవాల్సిన అంశాల పైన చర్చ చేయనున్నారు. అదే విధంగా పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పించటం పైన నిర్ణయం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం పైన చర్చించి.. విధానం ఖరారు చేయనున్నారు. మిత్రపక్షాలతో సమన్వయం పైనా సీనియర్లకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్య నేతలకు ఇక నుంచి ఇతర బాధ్యతలు కేటాయిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు సమాచారం.
కీలక నిర్ణయాల దిశగా
అదే విధంగా తెలంగాణలో బీజేపీ తో కలిసి పని చేసే అంశం పైన పార్టీ నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేయనున్నారు. తెలంగాణలోనూ కలిసి పని చేసే అంశం పైన తాజాగా అమిత్ షా అమరావతికి వచ్చిన సమయంలో ప్రస్తావనకు వచ్చింది. కాగా, తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ భవిష్యత్ పాత్ర పైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక.. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్న అభిప్రాయం.. పార్టీ కేడర్ కు ప్రాధాన్యత వంటి అంశాల పైన ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీలో మార్పులు - చేర్పుల గురించి చంద్రబాబు స్పష్టత ఇస్తారని చెబుతుండటంతో ఈ సమావేశం పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications