chandrababu naidu telugu desam party andhra pradesh janmabhoomi rahul gandhi రాహుల్ గాంధీ చంద్రబాబు
జన్మభూమి వేళ ఢిల్లీ టూర్ : చంద్రబాబు ఆకస్మిక పర్యటన వెనుక..!
ఏపిలో ఒక వైపు జన్మభూమి కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా సాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా ఢిల్లీ టూర్ ఖరారైంది. ఇప్పుడు ఇదే విషయం ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. ఈ సారి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నేరుగా ఏపిలో చంద్రబాబు.. లోకేష్ ను ఉద్దేశిస్తూ పలు ఆరోపణలు చేసారు. ఆ వెంటనే..ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లుండటంతో ఇప్పుడు దీని పై ఆసక్తి కరమైన చర్చ సాగుతోంది..
ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు..
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. కొద్ది కాలం క్రితం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ బీజేపీయేతర పార్టీల భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోపాటు పలు బీజేపీ యేతర పార్టీల అధినేతలు ఇందులో పాల్గొన్నారు. దేశం కోసం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఒక్కటి కావాలని అంతా అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సభలు, ర్యాలీలు పెట్టాలని కూడా అనుకున్నారు.

అయితే ఆ తర్వాత 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడంతో.. మళ్లీ మరోసారి ఈ నేతలంతా కలవలేదు. ఆ మీటింగ్ కు కొనసాగింపుగానే ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, జన్మభూమి కార్యక్రమం కొనసాతున్న సమయంలో ఇంత హడావుడిగా ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేసుకోవటం పై అనేక రకాలైన కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.
రాహుల్ తో భేటీ..
ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ ప్రధాని దేవెగౌడ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలు ఫరూక్ అబ్దుల్లా, అజిత్‌సింగ్, కేజ్రీవాల్ తదితరులతో సమావేశమవుతారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఎలా కలిసి పనిచేయాలి అనే అంశం పై చర్చిస్తారు. అనంతరం అదేరోజు రాత్రి 12గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతి చేరుకుంటారు.

ఈ నేతలతో సమావేశంలో భాగంగా.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై సీబీఐ కేసు నమోదు చేయ డం, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై చట్టబద్ధ సంస్థలతో దాడులు చేయిస్తుండటం తదితర అంశాలపైన చంద్రబాబు చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెదేపా ఎంపీలతోనూ సమావేశమవుతారని వెల్లడించాయి. ఇక, ప్రధాని మోదీ తాజాగా చంద్రబాబు -తనయుడు లోకేష్ ను ఉద్దేశించి పలు ఆరోపణలు చేసారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన లో ఈ ఆరోపణల పై స్పందన ఉంటుందని భావిస్తున్నారు.