చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఖర్చు రూ.2.66 కోట్లు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రభుత్వ ఖర్చు రూ.2.66 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గుంటూరు జిల్లా నాగార్జున నగర్ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమానికి కలెక్టర్ సురేష్‌కుమార్, గుంటూరు ఐజీ పివి సునీల్ కుమార్ నేతృత్వంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర, జాతీయస్థాయిల్లోని వివిఐపిలు, విఐపిలు పెద్ద సంఖ్యలో హాజరు కానుండడంతో వారి భద్రత , ఇతర ఏర్పాట్లు చేపట్టాల్సి ఉండడంతో సాధారణ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ బుధవారం ప్రకటించింది. ఆయా రైళ్లకు ప్రమాణ స్వీకారం జరిగే వేదికకు దగ్గరలోనే నిలుపుదల సౌకర్యం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌లతో నడుస్తాయని, జనసాధారణ్ రైళ్లు అన్ రిజర్వుడ్ కోచ్‌లతో నడుస్తాయని సీనియర్ డీసీఎం సీ రామకృష్ణ తెలిపారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ సమయం దగ్గర పడటంతో విజయవాడ కమిషనరేట్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గన్నవరం నుంచి వారధి వరకు నిఘాను పెంచారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఐదు ప్రత్యేక విమానాల్లో వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని విజయవాడ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
వీవీఐపీలను తరలించేందుకు మూడు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశామని వారు వెల్లడించారు. మావోయిస్టు, టెర్రరిస్టుల కదలికలను గుర్తించేందుకు ఎయిర్‌పోర్టు, విజయవాడల్లో కౌంటర్ ఇంటిలిజెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో సబ్‌కంట్రోల్ ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి పంజాబ్ సీఎం ప్రకాష్‌సింగ్‌బాదల్, ఆరాష్ట్ర ఉపముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు సమాచారం అందిందని కమిషనరేట్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications