జగన్ సర్కార్‌కు చెన్నై సూపర్ కింగ్స్ సహకారం: తిరుపతి సహా ఈ నాలుగు నగరాల్లో..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించిన మరో కొత్త కార్యక్రమం- ఆడుదాం ఆంధ్రా. రాష్ట్రంలో గ్రామస్థాయిలో గుర్తింపునకు నోచుకోలేకపోతోన్న మెరికల్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం ఇది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి ఆడుదాం ఆంధ్రా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడోత్సవాలను నిర్వహించనుంది.
దీనిపై వైఎస్ జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం ఏర్పాటైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జీ వాణీమోహన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ కే హర్షవర్ధన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇప్పటివరకు ఎప్పుడూ నిర్వహించని విధంగా గ్రామస్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. క్రీడా స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలని చెప్పారు. ఈ ఆటలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని అధికారులను సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించాలని, రాష్ట్రస్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలని అన్నారు.
రాష్ట్రానికి చెంది ప్రముఖ క్రీడాకారులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో క్రికెట్ సహా ఇతర క్రీడల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేలా ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.
రాష్ట్రంలో క్రికెట్‌ను అభివృద్ధికి చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ముందుకొచ్చిందని జగన్ అన్నారు. ఈ ఫ్రాంఛైజీ ప్రతినిధులు ఇదివరకే తనను కలిసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలలో క్రికెట్ అకాడమీల ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి తగినంత సహాయ, సహకారాలను అందించడానికి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధంగా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications