చిరంజీవి వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన వైఎస్సార్సీపీ.. ఉలికిపాటు వెనుక పెద్ద టెన్షన్!
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మెగాస్టార్ చిరంజీవి తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర అభివృద్ధిపై సానుకూలంగా మాట్లాడటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడేలా పరిస్థితి మారింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రోడ్లు బాగున్నాయని, పంచాయతీలు దేశ స్థాయిలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాయని, ఆరోగ్య రంగంలోనూ మెరుగుదల కనిపిస్తోందని చిరంజీవి అన్నారు.
తాను చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి వచ్చానన్న చిరంజీవి ప్రయాణంలో అడిగితే గతానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. మంచి రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు 23, 25 స్థానాల్లో ఉన్న పంచాయతీలు ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయన్నారు. నెమ్మదిగా అన్ని రంగాలు బాగుపడుతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ద్వారా ఆరోగ్య సేవలు మెరుగవుతున్నాయి. ఈ అభివృద్ధి కొనసాగి ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు.

ఈ వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖపై ప్రశంసలుగా కనిపిస్తున్నాయి. చిరంజీవి తాజా వ్యాఖ్యలతో జనసేన పార్టీకి మైలేజ్ వస్తుందని భావించిన వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే రహస్య జీవోలు, ధరల పెరుగుదల, రోడ్ల పరిస్థితిపై విమర్శలు చేస్తున్న వైసీపీకి, చిరంజీవి మాటలు కొత్త చిరాకుకు కారణం అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో, ముఖ్యంగా కోస్తా జిల్లాలు తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ, ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో భారీ అభిమానుల బలం ఉంది. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఏపీలో కూటమి సర్కార్ కు ఇది ప్లస్ గా మారింది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు చిరంజీవి వ్యాఖ్యలను టార్గెట్ చేశారు. అమరావతి రోడ్లలో గుంతలు ఉన్నాయని, నిత్యావసరాల ధరలు పెరిగాయని ఎదురుదాడి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తన కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉన్నారు కాబట్టే ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చిరంజీవి చెబుతుండొచ్చు. పైగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి లబ్ధి చేకూర్చడంలో భాగంగానే చిరంజీవి వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాగున్నాయని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. పవన్ కళ్యాణ్ కోసమే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారని, కానీ చిరంజీవి చెప్పినట్టు రాష్ట్రంలో పరిస్థితి లేదన్నారు.
చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయంగా ఎప్పుడూ బలమైన కారకంగా నిలిచింది. గతంలో ఆయన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా అభిమానుల ప్రభావం కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైఎస్సార్సీపీకి కొత్త టెన్షన్‌గా మారాయి. అభిమానుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న యువత, మహిళలు, గ్రామీణ ప్రజలు చిరంజీవి వ్యాఖ్యల ప్రభావంలో పడే అవకాశం లేకపోలేదు. ఏ కొద్ది నష్టం జరిగినా జరిగినట్టే అని భావిస్తున్న వైసీపీ అందుకే చిరంజీవి వ్యాఖ్యలను టార్గెట్ చేసింది. స్థానిక ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఓటు విధానంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
