వర్మకు పదవి రాకుండా అడ్డుకుందెవరు..!!
వర్మకు పదవి ఎందుకు రాలేదు. పిఠాపురంతో పాటుగా టీడీపీలోనూ జరుగుతున్న చర్చ ఇది. తాజా ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం వర్మ సీటు త్యాగం చేసారు. చంద్రబాబు నాడు వర్మకు సరైన పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది. ఎమ్మెల్సీ పదవులతో సహా.. టీటీడీ బోర్డు నియమించారు. కానీ, వర్మకు ఎలాంటి పదవి దక్క లేదు. ఇప్పటికీ నియోజకవర్గం లో టీడీపీ - జనసేన మధ్య సంధాన కర్త పాత్రకే పరిమితం అయ్యారు. అసలు వర్మకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు. ఏం జరుగుతోంది.
నాడు హామీ ఇచ్చినా
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి గెలవటంతో వర్మ కీలకంగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని పవన్ స్వయంగా వెల్లడించారు. పిఠాపురం నుంచి పవన్ పేరు ప్రకటించిన వెంటనే వర్మ మద్దతు దారులు ఆందోళనకు దిగారు. చంద్రబాబుతో భేటీ తరువాత వర్మ తాను పూర్తిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ.. పవన్ గెలుపు కోసం శ్రమించారు. పవన్ గెలిచిన తరువాత వర్మకు ఎమ్మెల్సీ లేదా టీటీడీ బోర్డులో అవకాశం దక్కుతుందని టీడీపీ నేతలు భావించారు. కానీ, తొలి ఎమ్మెల్సీల నియామకంలో పవన్ సన్నిహితుడు హరి ప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం పిఠాపురంలో పవన్ తరపున ఆయనే అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.

వర్మకు దక్కని ఛాన్స్
తాజాగా ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సైతం ప్రకటించింది. అందులో తూర్పు గోదావరి నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. కానీ, వర్మ కు స్థానం కల్పించ లేదు. 2014లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి గెలిచిన వర్మ.. తాజా ఎన్నికల్లో స్థానికంగా మూడు పార్టీలను కలిపి పవన్ కు భారీ మెజార్టీ రావటం కోసం పని చేసారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. తొలి విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేసారు. అందులోనూ అవకాశం ఇవ్వలేదు. ఇక, తాజా ఎన్నికల్లో సీటు దక్కని వారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా బరిలోకి దింపారు. తూర్పు గోదావరి నుంచి వర్మ పేరు పరిశీలిస్తారనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, వర్మకు అక్కడా ఛాన్స్ ఇవ్వలేదు.
ఇవ్వకపోవటం వెనుక
ఇక, కొద్ది కాలంగా పిఠాపురంలోనే టీడీపీ, జనసేన కేడర్ మధ్య గ్యాప్ పెరిగింది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన కేడర్ నుంచి వర్మకు సరైన గౌరవం దక్కటం లేదనే వాదన నియోజవకవర్గ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. పవన్ పిఠాపురం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ వర్మ కు ప్రాధాన్యత దక్కుతోంది. ఆ తరువాత షరా మామూలే. ఇక..రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ పైన కసరత్తు తుది దశకు చేరుకుంది. అందులోనూ వర్మకు అవకాశం ఉంటుందనే నమ్మకం లేదని చెబుతున్నారు. అయితే, వరుస నియామకాలు చేస్తున్న చంద్రబాబు - పవన్ ఇప్పటికీ వర్మ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటానికి కారణం ఏంటనే చర్చ మొదలైంది. అసలు వర్మకు పదవి వస్తుందా .. ఏ హోదా ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications